టమాటాల లారీ బోల్తా.. దొరికిన కాడికి ఎత్తుకెళ్లిన జనం..

టమాటాల లారీ బోల్తా.. దొరికిన కాడికి ఎత్తుకెళ్లిన జనం..

టమాటా ..ఈ పేరు వింటనే ప్రస్తుతం జనం గుండె గుబేల్ ముంటుంది. టమాటా రేటు వింటే ఓ యమ్మో అనక తప్పని పరిస్థితి. అయితే ఈ సమయంలో టమాటాలు ఫ్రీగా దొరికితే..అది కూడా అందినకాడికి దోచుకెళ్లే అవకాశం ఉంటే పండగే కదా. ఈ అవకాశం ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు దక్కింది. ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణంలో టమాటా లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. 

 టమాటాలతో జంప్..

పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి ఓ యజమాని  ఓ లారీలో టమాటాలను ఆదిలాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నాడు. ఈ సమయంలో ఆదిలాబాద్ పట్టణంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై  మావల వద్ద జులై 15వ తేదీ శనివారం సాయంత్రం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుపై టమాటా బాక్సులు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అందినకాడికి టమాటాలను ఎత్తుకెళ్లారు. ఒక్కొక్కరు కిలోల చొప్పున మోసుకెళ్లారు. కొందరైతే బస్తాలు, బ్యాగులు తెచ్చుకుని వాటిల్లో నింపుకున్నారు. 

పోలీసులతో టమాటాలకు సెక్యూరిటీ..

ఓ వైపు టమాటాలను ప్రజలు ఎత్తుకెళ్తుండా..యజమాని లబోదిబో మన్నాడు. తీసుకెళ్లొద్దంటూ వేడుకున్నాడు. అయినా జనం  వినలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..టమాటాలకు రక్షణ కల్పించారు. లారీలో టమాటాల విలువ రూ. 22 లక్షలు ఉంటుందని యజమాని తెలిపాడు. 

మండిపోతున్న టమాటా..

దేశ వ్యాప్తంగా కొన్ని రోజులుగా టమాటాల ధర మండిపోతోంది. తెలంగాణ, ఏపీలో కిలో రూ. 120 నుంచి రూ. 180 వరకూ పలుకుతోంది. ఇక  ఢిల్లీ, గుర్గావ్, లక్నో లాంటి నగరాల్లో కిలో టమాటా రూ. 250 వరకూ విక్రయిస్తున్నారు.