బయటపడిన టానిక్ మరో బాగోతం!.. అడ్డదారిలో పాగా

బయటపడిన టానిక్ మరో బాగోతం!.. అడ్డదారిలో పాగా
  • టెండర్ వేయకున్నా ఏఏ అవొకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్టు 
  • సాకులతో ప్రభుత్వ ఖజానాకు రూ. 10.52 కోట్లు చిల్లు 
  • 2.2 ఎకరాలకే లీజ్.. అదనంగా 3.7 ఎకరాల్లో ఆక్రమణలు 
  • హెరిటేజ్ రాక్స్, చెట్లను కూల్చేస్తూ పర్యావరణ విధ్వంసం 
  • సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ఫిర్యాదు.. సీఎం సీరియస్ 

హైదరాబాద్, వెలుగు: టానిక్ సంస్థ మరో బాగోతం బయటపడింది. హైదరాబాద్ లోని దుర్గం చెరువు వద్ద ఎకో టూరిజం పార్కు డెక్ అండ్ పార్టీ ఏరియా కోసం అడ్డదారుల్లో ఏఏ అవొకేషన్స్ పేరిట ఒప్పందాలు చేసుకుని అక్కడి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నది. ఆ కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థ నుంచి.. టెండర్ల ప్రక్రియలో పాల్గొనకుండానే ప్రాజెక్టును తీసుకున్నది.  ఒప్పందం చేసుకున్నా సాకులు చెబుతూ ప్రభుత్వానికి రూ.10.52 కోట్లు ఎగనామం పెట్టింది. దుర్గం చెరువు పార్కులోని 3.7 ఎకరాలు ఆక్రమించేలా నిర్మాణాలను చేపడుతున్నది. వేల ఏళ్లనాటి హెరిటేజ్ రాక్స్​ను, శిల్పాలు, అరుదైన జాతుల చెట్లను కూల్చేస్తూ కొత్త బార్లను కట్టేందుకు రెడీ అయింది. ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా.. అటు పర్యావరణాన్ని దెబ్బతీసేలా దుర్గం చెరువు ఎకాలజీకి నష్టం చేసేలా వ్యవహరించిన టానిక్ సంస్థ ఓనర్ అనీత్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ సంస్థ బండారమంతా బట్టబయలైంది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కీలకం కాగా, అప్పటి టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు సహకరించారన్న ఆరోపణలు వస్తున్నాయి.   

టెండర్ వేసిన ఒకే ఒక్క సంస్థ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఆనుకుని దుర్గం చెరువు వద్ద సర్వే నెంబర్ 403/పీలోని 2.2 ఎకరాల్లో (12,391.27 చదరపు గజాలు) ఎకో టూరిజం డెక్​అండ్ పార్టీ ఏరియా డెవలప్​మెంట్ లీజు కోసం 2018 జూన్​లో అప్పటి టూరిజం కార్పొరేషన్ టెండర్లను పిలిచింది. అదే ఏడాది జులై 4న హోటల్ కమల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకే ఒక్క సంస్థ టెండర్ వేసింది. ఆ తర్వాత రెండు రోజులకు అంటే 2018 జులై 6న హోటల్ కమల్ ప్రైవేట్​ లిమిటెడ్​కు నెలవారీ లీజు రెంటు రూ.15,81,200కు గాను లీజుకిస్తున్నట్టు టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. 

అయితే, ఒప్పందం విషయంలో ఎనలేని జాప్యం చేశారు. ఏడు నెలల దాకా ఒప్పందం జరగలేదు. ఇంతలోనే 2019 ఫిబ్రవరి 28న టానిక్ ఎలైట్ వైన్​షాపులకు చెందిన అనీత్ రెడ్డికి చెందిన ఏఏ అవొకేషన్స్  ప్రైవేట్ లిమిటెడ్ తో టూరిజం కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. కనీసం టెండర్ ప్రక్రియలో కూడా పాల్గొనని, కనీస అర్హతలు కూడా లేని సంస్థతో ఒప్పందం జరిగింది. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న హోటల్ కమల్ ఓనర్ అమర్ ఓరిస్​.. ఒప్పందం జరిగిన నాటికి ఏఏ అవొకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్​లోనూ డైరెక్టర్​గా ఉన్నారని చెప్తున్నారు. 

అడ్డదారుల్లో ఏఏ అవొకేషన్స్​కు అప్పగించేందుకే ఒప్పందంలో జాప్యం చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు 2021 ఆగస్టు 23న ఏఏ అవొకేషన్స్ బోర్డు నుంచి అమర్ ఓరిస్ తప్పుకున్నందున కమల్ హోటల్స్​తో ఏఏ అవొకేషన్స్​కు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థకు ప్రాజెక్టును అప్పగించడం చట్ట విరుద్ధమని అంటున్నారు.  

ఖజానాకు రూ. 10.52 కోట్లు చిల్లు  

ఎకో టూరిజం డెక్ అండ్ పార్టీ ఏరియాకు టూరిజం కార్పొరేషన్ కొన్ని షరతులను విధించింది. ఆ షరతులకు క్వాలిఫై అయితేనే టెండర్​ ఇవ్వాల్సి ఉంది. టెండర్​ దక్కించుకున్న సంస్థకు కనీసం హోటల్స్​/రెస్టారెంట్స్​, హాస్పిటాలిటీ సెక్టార్​లో పదేండ్ల అనుభవం ఉండాలి. కనీసం పది ఫుడ్​ అండ్ బార్ అవుట్​లెట్లను కలిగి ఉండాలి. లోకల్ డెక్కన్, తెలంగాణ క్వీజిన్​లో అనుభవం ఉండాలి. 

ఏడాది పాటు లిక్కర్ వ్యాపారం చేసి ఉండాలి. ఏడాదికి రూ.50 కోట్ల టర్నోవర్​ ఉండి.. మూడేండ్ల టర్నోవర్ డీటెయిల్స్ ఇవ్వాలి. కనీసం150 మంది ఉద్యోగులు ఈఎస్ఐ, ఈపీఎఫ్​లలో ఎన్​రోల్ అయి ఉండాలి. కానీ ఈ నిబంధనలను టూరిజం కార్పొరేషన్ పక్కనపెట్టింది. మినిమమ్ అప్​సెట్ ప్రైస్​ను రూ.12,30,100గా నిర్ణయించి, పదేండ్ల కాలానికి లీజు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇక లీజును దక్కించుకున్న సంస్థలు ఒకదానిపై ఒకటి సాకులు చెబుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాయని చెప్తున్నారు. ఐదున్నరేండ్లలో ఏకంగా  రూ.10,52,85,783 ఎగనామం పెట్టినట్టు తెలుస్తోంది.  

సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు 

లీజుకు తీసుకున్న ఏరియా వరకు మాత్రమే కాకుండా అంతకుమించి స్థలాన్ని ఏఏ అవొకేషన్స్ ఆక్రమిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డికి కొద్ది రోజుల క్రితం పలువురు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. 2.2 ఎకరాలకే లీజు ఒప్పందం ఉన్నా.. అదనంగా మరో 3.7 ఎకరాలను ఏఏ అవొకేషన్స్ ఆక్రమించిందని ఫిర్యాదులో తెలిపారు. పార్కులోకి సామాన్య జనం కూడా వెళ్లకుండా రేకులతో అడ్డం పెట్టేశారని, ఆ తర్వాత పలువురి ఫిర్యాదులతో అక్కడెక్కడో దూరంగా పార్కులోకి వెళ్లేలా చిన్న గేటును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 

ఎకో సెన్సిటివ్​ జోన్​లో ఉన్న దుర్గం చెరువు వద్ద హెరిటేజ్ రాక్స్, శిల్పాలను, చెట్లను నాశనం చేస్తున్నారని తెలిపారు. బాంబు బ్లాస్టులతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాల వెనక బీఆర్ఎస్ ఎంపీ సంతోష్​, అప్పటి టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ రావు ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో చెకింగ్ వెళ్లిన టూరిజం అధికారులను సైతం అక్కడి నుంచి తరిమేయగా.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. 

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. వెంటనే అక్కడి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో హెచ్ఎండీఏ అధికారులు దుర్గం చెరువు వద్ద ఉన్న కట్టడాలను కూల్చారని తెలుస్తున్నది. అయినా ఏఏ అవొకేషన్స్ అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.