ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ‘సుప్రీం, బాస్’ ఎవరు ? ఆ సుప్రీం, ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్

ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ‘సుప్రీం, బాస్’ ఎవరు ? ఆ సుప్రీం, ఆ బాస్ ఎవరో తేల్చే పనిలో సిట్
  • నాడు రాధాకిషన్​రావు నోట ‘సుప్రీం’ మాట.. నేడు ప్రభాకర్​రావు నోట ‘బాస్​’ ముచ్చట
  • ఆధారాలతో ప్రశ్నిస్తున్న సిట్​
  • పూటకో మాట చెప్తున్న ప్రభాకర్​రావు 
  • మొదట్లో రూల్స్​ ప్రకారమే అంటూ తప్పించుకునే ప్రయత్నం.. తర్వాత పైఅధికారుల 
  • అనుమతితోనే అంటూ మరో పాట
  • తాజాగా ఆధారాలు చూపెట్టడంతో ‘బాస్​ ఆదేశాలతో  చేశాం’ అంటూ జవాబు
  • ఆ సుప్రీం, ఆ బాస్​ ఎవరో తేల్చే పనిలో సిట్​

హైదరాబాద్​, వెలుగు: ఫోన్ ​ట్యాపింగ్​ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్​రావు సిట్​ విచారణలో  పూటకోమాట చెప్తున్నట్లు తెలిసింది. తాము అంతా రూల్స్​ ప్రకారమే చేశామని.. మావోయిస్టు సానుభూతిపరులు, వారికి సహకరిస్తున్న వారి ఫోన్​ నంబర్లు మాత్రమే ట్యాప్​ చేశామని మొదట్లో చెప్పిన ఆయన.. తర్వాత పైఅధికారుల అనుమతితోనే అంటూ మరో పాట అందుకున్నారు. ఆధారాలు ముందుపెట్టి ప్రశ్నించడంతో కొత్తగా ‘అదంతా బాస్​ ఆదేశాల మేరకే చేశాను’ అని చెప్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సిట్​ ఆఫీసర్లు ‘ఆ బాస్’​ఎవరో చెప్పించేందుకు మరింత లోతుగా విచారిస్తున్నారు. 

అప్పట్లో రాధాకిషన్​రావు నోట ‘సుప్రీం’ ముచ్చట 
బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో సిటీ టాస్క్‌‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌‌ రావు రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. అప్పటి ప్రభుత్వం 2016లో  ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్‌‌ డీఐజీగా నియమించింది. తర్వాత ఆయన తన సామాజికవర్గంలో నమ్మకమైన దుగ్యాల ప్రణీత్‌‌రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావుతో పాటు తిరుపతన్నతో కలిసి ఫోన్​ట్యాపింగ్​ కోసం ప్రత్యేక టీమ్​ ఏర్పాటుచేశారు. అనంతరం ‘సుప్రీం’ సూచనల మేరకు 2017లో తనను సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీగా నియమించారని రాధాకిషన్ రావు సిట్​విచారణలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ పాలనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, ఇందులో భాగంగా ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను ఆర్థికంగా దెబ్బతీయాలని ‘సుప్రీం’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పనిచేశామని ఆయన స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే  దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 ఎన్నికల ముందు ప్రత్యర్థులు, వారి అనుచరుల ఇండ్లలో సోదాలు నిర్వహించి కోట్ల రూపాయలు సీజ్ చేశామని సిట్​విచారణలో వెల్లడించారు. అప్పట్లో ‘ఈ సుప్రీం ఎవరు?’ అనే చర్చ జరిగినా.. ఆ వివరాలను సిట్​బయటపెట్టలేదు.

ఆధారాలు ముందుంచి ప్రశ్నించడంతో.. 
ప్రభుత్వం మారగానే అమెరికా పారిపోయి, ఇటీవలే  తిరిగివచ్చి విచారణకు హాజరవుతున్న ప్రభాకర్​రావు సిట్​విచారణలో పూటకో మాట చెప్తున్నట్లు తెలిసింది. తాము  రూల్స్ ప్రకారమే డ్యూటీ చేశామని,  మావోయిస్టు సానుభూతిపరులు, వారికి సహకరిస్తున్న వారి ఫోన్​నంబర్లు మాత్రమే ట్యాప్​ చేశామని మొదట్లో చెప్పిన ఆయన.. ట్యాపింగ్​జరిగిన ఫోన్​నంబర్ల లిస్టు ముందు పెట్టి విచారించడంతో సీనియర్ ఆఫీసర్లు, డీజీల అనుమతి ఉందంటూ మాట మార్చారు. తద్వారా అప్పట్లో డీజీపీలుగా, హోంసెక్రటరీలుగా, సీఎస్​లుగా పనిచేసిన ఉన్నతాధికారులను ఇరికించేందుకు ప్రయత్నించారు.

కానీ.. రివ్యూ కమిటీ, డీవోటీ పర్మిషన్​కోసం పంపిన లిస్టులో ముందు పేజీల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరుల నంబర్లు పేర్లు పెట్టి.. తర్వాతి పేజీల్లో పేర్లు మార్చి పొలిటికల్​లీడర్లు, వాళ్ల అనుచరులు, జడ్జీలు, ఐఏఎస్​లు, ఐపీఎస్​లు సహా వందలాది మంది నంబర్లు పెట్టినట్లు ఆధారాలను ప్రభాకర్​రావు ముందు సిట్​ అధికారులు ఉంచి ప్రశ్నించడంతో.. ఆయన ‘బాస్’ పేరు బయటపెట్టినట్లు తెలిసింది.

​‘బాస్​ ఆదేశాలమేరకు వారందరి ఫోన్లు ట్యాప్​చేశాం’ అని ప్రభాకర్​రావు చెప్పినట్లు సమాచారం. దీంతో గతంలో రాధాకిషన్​రావు చెప్పిన ‘సుప్రీం’, ఇప్పుడు ప్రభాకర్​రావు చెప్తున్న ‘బాస్​’ ఒకరే అని భావిస్తున్న సిట్​అధికారులు.. ‘‘ఆ సుప్రీం, ఆ బాస్​ ఎవరో’’ ఇంకా బయటపెట్టడం లేదు. తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.