సక్సెస్ : ట్రిప్​కి వెళ్లి.. పదేండ్ల తర్వాత ఇంటికి!

సక్సెస్ : ట్రిప్​కి వెళ్లి.. పదేండ్ల తర్వాత ఇంటికి!

టోర్బ్​జోర్న్​ పెడెర్సెన్​ది డెన్మార్క్​. ఇతను ఒక్క ఫ్లయిట్ జర్నీ కూడా చేయకుండా ఏకంగా 195 దేశాలు ట్రావెల్​ చేశాడు. టోర్బ్​జోర్న్​ 2013లో ఈ జర్నీ స్టార్ట్ చేశాడు. ట్రావెల్ చేయడానికి కావాల్సిన షర్ట్స్​, జాకెట్స్, షూస్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివన్నీ తనతో పాటు తీసుకెళ్లాడు. నాలుగేండ్ల తర్వాత కోపెన్​హగన్​కు తిరిగి రావచ్చు అనుకున్న అతనికి అదనంగా ఆరేండ్లు ఎక్కువ టైం పట్టింది. దాదాపు 2,60,000 మైళ్ల ప్రయాణంలో కారు, రైలు​, బస్, ట్యాక్సీ, బోట్​, షిప్పింగ్​ కంటెయినర్స్​లో జర్నీ చేశాడు.

కొన్నిసార్లు కాలినడకన కూడా వెళ్లాడు. ఈ జర్నీలో అతడికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వీసా ఇష్యూస్​ నుంచి చావు అంచుల దాకా అన్నీ చూశాడట టోర్బ్​. అయినా సరే అవన్నీ తట్టుకున్నాడు. అదెలా? అనడిగితే... ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో తిరిగిన టూరిస్ట్​ల గురించి చదివి ఇన్​స్పైర్​ అయ్యాడట. దాంతో అడ్వెంచర్​ చేయాలనే ఆలోచనతో 2013, అక్టోబర్​లో డెన్మార్క్​ నుంచి జర్మనీకి ట్రైన్​ జర్నీ చేశాడు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాడు. అయితే రోజుకి కేవలం ఇరవై డాలర్లు ఖర్చు చేశాడట. ప్రతి దేశంలో హాస్టల్స్​లో ఉండేవాడట.

సవాళ్లను ఎదిరించి.. పెండ్లి చేసుకుని

2013లో ప్రయాణం మొదలైన తర్వాత మొదటిసారి ఒక సవాలు ఎదురైంది అతనికి. నార్వే నుంచి ఫరో ఐలాండ్​కు సముద్రం మీద జర్నీ చేయాలనుకున్నాడు. కానీ, తనను తీసుకెళ్లే బోట్​ కనిపించలేదు. దాంతో షిప్పింగ్​ కంపెనీలోనే మూడు రోజులు స్టక్​ అయిపోయాడు. ఆ తర్వాత మళ్లీ జర్నీ కంటిన్యూ చేశాడు. అలాగే 2014లో ప్రమాదకర పరిస్థితుల్లో ఐస్​లాండ్​లో బోట్​ రైడ్​కి వెళ్లాడు. ఆ మరుసటి ఏడాది టోర్న్​కి సెరిబ్రల్ మలేరియా ఉన్నట్టు డాక్టర్​ చెకప్​లో తెలిసింది. అది హాలూసినేషన్స్​కి(లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు భ్రాంతి చెందడం) దారి తీస్తుంది. దాంతోపాటు చిన్న పనులు చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పారు డాక్టర్స్​. ఇలాంటి టైంలోనే అతను ఒంటరితనం, అలసట వంటి ఆలోచనలతో పోరాడాడు.

ఇక ఆఫ్రికా జంగిల్​లో 2016లో ఒక పెద్ద ఇన్సిడెంట్​ జరిగింది. ఆ అడవిలో తాగి డాన్స్​ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు టోర్న్​ దగ్గరకి వెళ్లి తలకు గన్​ గురిపెట్టారు. ఆ తరువాత ఏమైందో ఏమో కానీ, వాళ్లు అతన్ని ఏం చేయకుండా వదిలిపెట్టేశారు. ఇవే కాకుండా వీసా అప్లికేషన్స్ మాటిమాటికి రిజెక్ట్ అయ్యేవి కూడా. ఈ ప్రయాణంలో ట్యాక్సీ డ్రైవర్స్​, వేరే దేశాల్లో ఉన్న ఫ్రెండ్స్ సాయం తీసుకున్నాడు. ఈ జర్నీలోనే అతనికి గర్ల్​ ఫ్రెండ్​ కలిసింది. ఆమెకు ప్రపోజ్​ కూడా చేశాడు. 2019లో నార్త్ కొరియా నుంచి బీజింగ్​కు ట్రావెలర్స్​తో కలిసి జర్నీ చేశాడు. 2020 నాటికి హాంకాంగ్​ చేరుకున్నాడు. ప్యాండెమిక్​ కావడంతో తను అక్కడే ఒక చర్చి​లో పని చేస్తూ ఉండిపోయాడు.

ఆ చర్చి వాళ్లే అతనికి షెల్టర్​ ఇచ్చారు. 2022లో వనవాటు దేశంలో పెండ్లి కూడా చేసుకున్నాడు. అదే ఏడు మాల్దీవ్స్​కి వెళ్లాడు. అదే అతను వెళ్లిన చివరి దేశం. ఆ తర్వాత రెండు నెలలు మహాసముద్రాల్లో ప్రయాణిస్తూ డెన్మార్క్​ చేరుకున్నాడు. అతను ఇంటికి చేరుకోగానే 150 మంది ప్రజలు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. ఇదే టోర్బ్​ జోర్న్​ ఇంట్రెస్టింగ్​ ట్రావెల్ జర్నీ.  

ఎవరైనా ట్రిప్​కి వెళ్తే మూడు లేదా నాలుగు రోజులు ఉంటారు. కొందరు వారం లేదా పది రోజులు ట్రిప్​ వేస్తారు. కానీ, ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా పదేండ్లు ట్రిప్​కి వెళ్లి ఇప్పుడు ఇంటికి వచ్చాడు. అయితే తను వెళ్లింది ఒకటో రెండో ప్రదేశాలకు కాదు.. ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్లొచ్చాడు. విదేశాలకు వెళ్లాలంటే విమానంలో ప్రయాణించాల్సిందే అనుకుంటున్నారా! ఇతను ఒక్కసారి కూడా ఫ్లయిట్​ ఎక్కలేదు. అయినా అన్ని దేశాలూ తిరిగొచ్చాడట!