కేరళలో కుండపోత వర్షాలు.. మునిగిన ఊర్లు.. స్కూల్స్ కు సెలవులు

కేరళలో కుండపోత వర్షాలు.. మునిగిన ఊర్లు.. స్కూల్స్ కు సెలవులు

రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేరళలోని మొత్తం 12 జిల్లాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కొల్లం, తిరువనంతపురంలో యెల్లో అలెర్ట్ ప్రకటించారు. రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో మత్యకారులు సముద్రంలోకి  వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

మీనాచిలార్, మణిమలయార్ లలో నీటిమట్టం పెరగడంతో తీర ప్రాంతంలో అలెర్ట్ ప్రకటించారు. పతనంతిట్టలోని అచ్చన్ కోవిలార్ లోనూ నీటిమట్టం పెరిగింది. మణిమాల నదిపై ఉన్న కల్లుపర, పుల్లకైర్ స్టేషన్లు, పంపా నదిపై ఉన్న మడమన్ స్టేషన్, అచ్చంకోవిల్ నదిపై ఉన్న తుంబమాన్ స్టేషన్, మీనాచిల్ నదిపై కీటంగూర్ స్టేషన్లలో నీటిమట్టం ప్రమాద స్థాయికి మించి ఉండడంతో కేంద్ర జల సంఘం ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ లు జారీ చేసింది. ప్రస్తుతం వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన నష్టం వాటిల్లింది. కన్నూర్ సెంట్రల్ జైలు భద్రతా గోడ కూలిపోయింది. మలప్పురం జిల్లాలో 13 ఇళ్లు పాక్షికంగా కూలిపోగా.. 13 కుటుంబాలను పొన్నానిలోని శిబిరాలకు తరలించారు. పెరింతల్ మన్న వద్ద పార్క్ చేసిన వాహనాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. తిరువనంతపురం, పొన్నుడి నుంచి రాకపోకలు స్తంభించాయి. త్రిసూల్ పిడుగుపాటు కారణంగా చలకుడి, ఇరింగలకుడిలో భారీ నష్టం వాటిల్లింది.

మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎర్నాకుళం, అలప్పుజా, కాసర్గోడ్ జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో ప్రొఫెషనల్ కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.