చేవెళ్లలో బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్ .. కొండా విశ్వేశ్వర్​రెడ్డి, రంజిత్ రెడ్డి మధ్య టఫ్​ఫైట్​

చేవెళ్లలో బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్  ..  కొండా విశ్వేశ్వర్​రెడ్డి,  రంజిత్ రెడ్డి మధ్య టఫ్​ఫైట్​
  • నియోజకవర్గంలో ఖాళీ అయిన బీఆర్ఎస్​
  • నాలుగు చోట్ల ఎమ్మెల్యేలు గెలిచినా ఆగని క్యాడర్​ వలసలు
  • బీఆర్ఎస్ ఓట్లపై రెండు పార్టీల అభ్యర్థుల ఫోకస్

హైదరాబాద్, వెలుగు: చేవేళ్లపార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్​అభ్యర్థి రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొండా విశ్వేశ్వర్​రెడ్డి,  రంజిత్​రెడ్డిలలో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయన్న దానిపై అంచనాలు కూడా వేయలేకపోతున్నారు. బీఆర్ఎస్​అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్​మూడో స్థానానికే పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 ప్రచారంలో భాగంగా రానున్న ఐదేండ్ల పాటు ఏం చేస్తామనే దానిపై అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఐదేండ్లలో ఏం చేస్తాననే దానిపై 14 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో విద్య, వైద్యం, వ్యవసాయం నుంచి మొదలుపెడితే అన్ని అభివృద్ధి పనుల అంశాలు ఉన్నాయి. 

2014 నుంచి 2019 వరకు ఇదే సెగ్మెంట్​లో బీఆర్ఎస్​నుంచి ఎంపీగా పనిచేసిన అనుభవం కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఉండగా, 2019 ఎన్నికల్లో  బీఆర్ఎస్​నుంచి ఎంపీగా గెలిచిన అనుభవం రంజిత్ రెడ్డికి ఉంది. తర్వాత పార్టీలు మారి ప్రస్తుతం ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్​విషయానికొస్తే పూర్తిగా పట్టు కోల్పోయిన స్థితికి చేరుకుంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో రెండుసార్లు ఆ పార్టీ గెలుపొందినప్పటికీ ఈ సారి కనీసం ప్రభావం చూపే పరిస్థితి కూడా కనిపించడంలేదు. కీలకనేతల నుంచి మొదలు పెడితే కిందిస్థాయిలో ఉండే ప్రధాన లీడర్లంతా బీజేపీ, కాంగ్రెస్​పార్టీల్లో చేరారు.  

ఎవరి ధీమా వారిదే..

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జోష్ లో కాంగ్రెస్​ నేతలు పనిచేస్తున్నారు. దీంతో పదేండ్ల తర్వాత చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపుపై ధీమాతో ఉన్నారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఎన్నికల తర్వాత మరిన్ని గ్యారంటీలు అమలు  చేస్తామని, ఆగస్టు15లోపు రూ.2లక్ష లోపు రుణమాఫీ  చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకాలు కాంగ్రెస్​గెలుపుకు కలిసి వస్తాయని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

మరోవైపు ఎంపీ ఎన్నికల్లో మోదీ హవా నడుస్తుందని, ఇక్కడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సొంత ఇమేజ్ కూడా కలిసొస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 2019లో  జరిగిన ఎన్నికల్లో ఇక్కడ13 లక్షల ఓట్లు పోల్​కాగా బీజేపీకి 2లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. అప్పట్లో అంత బలమైన అభ్యర్థి లేకపోయినా మోదీ పై నమ్మకంతో అన్ని ఓట్లు వచ్చాయని, ఇప్పుడు బలమైన అభ్యర్థి పోటీ చేస్తుండడంతో గెలుపు బీజేపీదే అన్న నమ్మకంతో ఆ పార్టీ లీడర్లు ఉన్నారు.

 ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీఆర్ఎస్​, మూడుచోట్ల కాంగ్రెస్​ గెలిచాయి. ఓట్ల సంఖ్య చూసినా బీఆర్ఎస్​కే లక్ష ఓట్లు అధికంగా వచ్చాయి. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్​ఎంపీ అభ్యర్థి అనుకున్న రంజిత్​రెడ్డి కాంగ్రెస్​లో చేరి పోటీలో నిలవడం, ఆ పార్టీ క్యాడర్​మొత్తం ఖాళీ కావడంతో డీలా పడింది. బీఆర్ఎస్​ఓట్లు కాంగ్రెస్​, బీజేపీ వైపు డైవర్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

మూడో స్థానంలోనే బీఆర్ఎస్​..

చేవేళ్ల గడ్డపై బీఆర్ఎస్​రెండు సార్లు గులాబీ జెండా ఎగరవేసినప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచి భారీగా ఓట్లు సాధించినా..ఎన్నికల తర్వాత ఆ పార్టీ మొత్తం ఖాళీ అయ్యింది. జిల్లాలో బలంగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి ముఖ్య లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు పలువురు నియోజకవర్గ, మండల స్థాయి లీడర్లు కూడా పార్టీని వీడారు. ఇదంతా బీఆర్ఎస్​ కు పెద్ద ఎదురుదెబ్బే. 

పైగా కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు పెట్టగా అవి కాంగ్రెస్​ఖాతాలోకి చేరాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిన అభ్యర్థులతో పాటు గెలిచిన బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్​గా లేరు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్​ఇచ్చామని, బీసీలంతా ఏకమై ఆయనను గెలిపించుకోవాలని బీఆర్ఎస్​అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నప్పుడు బీసీ నేతలకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు  ఓడిపోతారని బీసీలను బలి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ​బీసీ మంత్రం కూడా బెడిసి కొట్టే విధంగానే కనిపిస్తోంది.