నరేంద్ర మోడీకి  కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు 

నరేంద్ర మోడీకి  కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు 

ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మెలిసి ఉన్నారన్నారు. గతంలో నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి వెళ్లకపోతే మంత్రులు వెళ్లేవారని.. ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హాజరైతే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానిని ముఖాముఖి ప్రశ్నించే అవకాశం ఉండేదని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అడుగుతారని అందరూ ఆశించినట్లు చెప్పారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నిలదీయొచ్చు

నీతి ఆయోగ్ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులకు సంబంధించి నిధులు రావాలని గతంలో చెప్పింది. మిషన్ భగీరథ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విజభన హామీలపై సమావేశంలో పాల్గొని మోడీని నిలదీయాలన్నారు. నోట్ల రద్దు చేసిన మోడీని కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు.  జీఎస్టీ బిల్లును సమర్థించారన్నారు. కేంద్రం తీసుకువచ్చిన అనేక బిల్లులకు టీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందన్నారు. మోడీ, కేసీఆర్ రాజకీయ ఆలోచన ఒకే విధంగా ఉంటుందన్నారు. ఏడున్నరేళ్లలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి  కేసీఆర్ ఏకలవ్య శిష్యుడిగా మారిపోయారని అన్నారు.

రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుంది

కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాకపోతే పరోక్షంగా మోదీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో గుజరాత్ లో వరదలు వస్తే రూ.1000 కోట్లు మంజూరు చేశారు. కానీ రాష్ట్రంలో వర్షాలు వస్తే ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. మాటలైతే మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయి కానీ చేతలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విపక్షాలను వేధిస్తున్నరు 

గతంలో శాసనసభ సమావేశాలు 50 రోజుల పాటు జరిగేవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అది 20 రోజుల పరిమితమైందని అన్నారు. కేంద్రంలో ,రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. విపక్షాలను నిర్వీర్యం చేయడానికే ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మాట వినని వారిని  వేధించడానికే రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం కేసుల నుంచి రక్షించుకోవడానికే సమావేశానికి గైర్హాజరవుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే కేసీఆర్ కు ప్రత్యేక విమానం కాంగ్రెస్ ఏర్పాటు చేస్తుందన్నారు.