కేసీఆర్, మోడీ గుండెలదిరేలా మునుగోడు తీర్పు

కేసీఆర్, మోడీ గుండెలదిరేలా మునుగోడు తీర్పు

ఆర్థిక లావాదేవీలు, అవసరాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోనియాగాంధీని వేధిస్తుంటే వీధుల్లో పోరు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర కాంట్రాక్టుల కోసం కూర్చున్నారని విమర్శించారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం  కన్నతల్లి లాంటి పార్టీపై అనుచితంగా మాట్లాడుతున్నరని అన్నారు. మునుగోడు ప్రజలు సోనియాగాంధీ ప్రతినిధిగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించారని..అయితే విశ్వాసఘాతకులుగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాళ్లకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేనని..కాంగ్రెస్ లేకపోతే బ్రాండీ అమ్ముకునేవారంటూ ఫైర్ అయ్యారు 

మునుగోడు ప్రజల గుండె చప్పుడు

రాజగోపాల్ రెడ్డికి పార్టీ అన్ని ఇచ్చిందని..ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు క్షమించరని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నష్టపోతుందని తెలిసిన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు. ఈ నెల 5న మునుగోడులో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని...ఆరోజు కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తామన్నారు. విస్పష్టమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్నామని..మునుగోడు ప్రజల గుండె చప్పుడు వింటామన్నారు. కేసీఆర్, మోడీల  గుండెలు అదిరేలా మునుగోడులో తీర్పు ఇప్పిస్తామన్నారు.

మోడీ మాటలను తెలంగాణ ప్రజలు మరిచిపోరు

మునుగోడు చైతన్యానికి పునాది అని..రజాకార్ల అరాచకాలకు ఎదరొడ్డి పోరాడిన గడ్డ అని రేవంత్ అన్నారు. రానున్న రోజుల్లో మునుగోడు ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పారు. మోడీ, కేసీఆర్ ముఠాలు, మూటలు, ఈడీ, ఇన్ కం ట్యాక్స్ లతో వచ్చినా..కాంగ్రెస్ శ్రేణుల ముందు తలవంచాల్సిందేనని అన్నారు. మునుగోడులో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తూ పార్లమెంట్ లో మోడీ మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు మరిచిపోరని చెప్పారు.  

వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటరు

రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో కొనసాగడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉంటారు. ఆయన క్రమ శిక్షణ కలిగిన నేత. పార్టీలో ఎన్నో హోదాలలో పనిచేశారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించేందుకు కృషి చేస్తారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.