జయశంకర్ సార్ మీద కేసీఆర్ కు కక్ష

జయశంకర్ సార్ మీద కేసీఆర్ కు కక్ష

హన్మకొండ: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పై కేసీఆర్ కక్ష కట్టారని, అందుకే ఆయన పేరు కాలగర్భంలో కలిసేలా కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటలో నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం దళిత వాడను సందర్శించి...  సిలువేరు జానీ కుటుంబసభ్యులతో కలిసి  భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ సొంత ఊరు అక్కంపేట నిరాదరణకు గురైందన్నారు. రాష్ట్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన జయశంకర్ కు కనీసం ఓ విగ్రహాన్ని కూడా కేసీఆర్ పెట్టలేదని మండిపడ్డారు. చివరకు కొండా దంపుతులే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. అక్కంపేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని ప్రకటించిన ఆయన... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీని గ్రామానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 

జూనియర్ కాలేజీ, పశువుల దవాఖాన, పేదలకు ఇండ్లు కట్టించడంతో పాటు గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, మధుసూదన చారి అక్కంపేటను అది చేస్తాం... ఇది చేస్తాం అంటూ కాలయాపన చేశారే తప్పే చేసిందేమీ లేదన్నారు. వారిద్దరూ తడిగుడ్డతో గొంతు కోసే రకమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్ లోని అన్ని హామీలను నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం చేతకాని కేసీఆర్... రూ. 5 లక్షల బీమా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ను దంచుడేనని... వచ్చే ఎన్నికల్లో అధికారం నుంచి దించుడేనని పేర్కొన్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే ప్రగతి భవన్ గోడులు బద్దలు కొడతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం...

ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రానికి వర్ష సూచన

టెట్ వాయిదా వేసే ప్రసక్తే లేదు