కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు

మునుగోడు: రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు.  తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిని చూడలేదని మండిపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నియోజకవర్గ  కార్యకర్తల్లో భరోసా నింపడానికి శుక్రవారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు  రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం
కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ విరుచుకుపడ్డారు. కన్న తల్లి లాంటి సోనియాను మోడీ, అమిత్ షా ఈడీ పేరుతో వేధింపులకు పాల్పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. 75 ఏళ్ల వయస్సులో... కరోనాతో బాధపడుతున్న సోనియాను అమిత్ షా, మోడీ కక్షగట్టి ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సోనియాను అవమానిస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా ఊరుకుందామా అని ప్రశ్నించారు. సోనియా గాంధీని వేధిస్తోంటే పట్టించుకోకుండా  రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. 

చిత్తు చిత్తుగా ఓడించాలె
కాంగ్రెస్ పార్టీని, సోనియా ప్రతిష్టను అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టిన రాజగోపాల్ రెడ్డిని  వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని... మరీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపునే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. జైలుకు పోయొచ్చిన రేవంత్ కింద పని చేయాలా అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారని... కానీ ఆ కేసులన్నీ 2014 తర్వాత టీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకే పెట్టారని చెప్పారు. తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్న విషయాన్ని  రేవంత్ గుర్తుచేశారు. అమిత్ షా పక్కన నిల్చుంటే లేని బాధ తన పక్కన ఉంటే వచ్చిందా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు తిక్కలోల్లు కదా ఏదేదో మాట్లాడుతారు అని ఊరుకున్నామని... కానీ ఇప్పుడు సోనియాను మోసం చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సే పదవులిచ్చినా రాజగోపాల్ రెడ్డి  పార్టీని మోసం చేశారని రేవంత్ రెడ్డి వాపోయారు. 

రాజగోపాల్ కు గుణపాఠం చెప్పాలె
దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ, హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని.. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం జరుగుతుందని రేవంత్ ప్రశ్నించారు. ఉప ఎన్నికలో గెలిస్తే ఎస్ ఎల్ బీసీ కోసం రూ.5000 కోట్ల రూపాయలు తీసుకొస్తావా అని రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయేది కాదని, పార్టీకి ద్రోహం చేసిన రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.