ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణ ఖేడ్, వెలుగు : రాహుల్ గాంధీ చేస్తున్న జోడో యాత్ర ఓట్ల కోసం కాదని, దేశ సమైక్యత కోసమే అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్​అన్నారు. ఆదివారం పట్టణంలోని నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం, కులం పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయాన్ని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. పార్టీలకతీతంగా రాహుల్ గాంధీ యాత్రను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగేశ్​షేట్కార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ ​షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.  
 

ఆలయాలకు కార్తీక శోభ

పటాన్​చెరు, వెలుగు:  సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పరిధిలోని వీరన్నగూడెంలోని శ్రీ భద్రకాళీ సహిత వీరభద్ర స్వామి ఆలయం కార్తీక శోభతో కళకళ లాడింది.  కార్తీక మాస ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ నిర్వహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఆలయం కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా పర్యవేక్షణలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు.  

లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో..
మెదక్​ (శివ్వంపేట), వెలుగు : శివ్వంపేట మండలం సికింద్లాపూర్​ లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన పూజారి ధనుంజయ శర్మ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

సింగూర్ ‘పవర్’ ఫుల్ అవుతోంది..
పుల్కల్, వెలుగు : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం నాటికి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 1999–2000లో 16715 మిలియన్ యూనిట్లతో ప్రారంభమై 2010-–11లో అత్యధికంగా  25.6872 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయ్యింది. ఆ తర్వాత 2022–-23 లో మొదటిసారిగా అక్టోబర్ 30న 25.7342 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. దీంతో ఆదివారం విద్యుత్ కేంద్రంలో ఆఫీసర్లు, సిబ్బంది సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో ఏడీ లు సౌజన్యరెడ్డి, రాధిక, పాండయ్య, నాగేంద్ర కుమార్, సిబ్బంది అశోక్ పాల్గొన్నారు. 

వీడిన స్టూడెంట్ సూసైడ్ కేసు మిస్టరీ
ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయనే ఆత్మహత్య 
సిద్దిపేట రూరల్, వెలుగు: చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులోని రంగనాయక సాగర్ లో దూకి సూసైడ్ చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన  ప్రవళిక(16) కేసు మిస్టరీ వీడింది. శనివారం ఘటన వెలుగులోకి రాగా ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయన్న ఆమె తల్లిదండ్రులు ఆదివారం చిన్నకోడూరు పీఎస్ కు వచ్చారు.  తమ కూతురు పెద్ద కోడూరు గ్రామంలోని పాలిటెక్నిక్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోందని, ఈ మధ్య జరిగిన సెమిస్టర్ ఎగ్జామ్ లో మార్కులు తక్కువగా వచ్చాయని తెలిపారు. మార్కుల విషయం తమతో చెప్పలేదని, ఈ తరుణం లోనే 29న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆమె రంగనాయక సాగర్ లో దూకి చనిపోయినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. తల్లి కోమురవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్వామిని బెదిరించడం తగదు
రామాయంపేట, వెలుగు:  రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన స్వామిని టీఆర్ఎస్ నాయకులు  బెదిరింపులకు గురిచేయడం తగదని ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. ఆదివారం కట్రియాల గ్రామస్తులు స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డిని రాజీ నామా చేయాలని అడగడం తప్పా అని ప్రశ్నించారు. స్వామిని టీఆర్ఎస్ నాయకులు  బెదిరించడం సరికాదన్నారు. తనకు టీఆర్ఎస్ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్వామి తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు జాల సాయిబాబా, తదితరులు ఉన్నారు. 

పోలీస్ స్టేషన్ వద్ద ముదిరాజ్ సంఘం ఆందోళన

తూప్రాన్, వెలుగు :  ప్రేమ వివాహం చేసుకొని కనిపించకుండా పారిపోయిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం తూప్రాన్ పోలీస్టేషన్ వద్ద రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో 13 జిల్లాల అధ్యక్షులు, నాయకులు స్టేషన్ కు వచ్చారు. మనోహారాబాద్​లో 200 మందికి పైగా ముదిరాజ్ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. మనోహరాబాద్ మండలం ధర్మారాజ్ పల్లికి  చెందిన యశ్వంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన తేజస్వీనిని ప్రేమించి వారం రోజుల కింద  వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి తూప్రాన్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్నారు.  పెండ్లి అయిన మరుసటి  రోజే తేజస్వినిని యశ్వంత్ రెడ్డి వదిలేసి కనిపించకుండాపోయాడు. ఇద్దరి కులాలు వేరు కావడంతోపాటు ముదిరాజ్ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ యువతిని కాపురానికి తీసుకుపోయేందుకు అంగీకరించడంలేదు. ఈ విషయమై మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడేందుకు వెళ్లగా అక్కడ ఎస్సై లేకపోవడంతో తూప్రాన్ లో డీఎస్పీని కలిసేందుకు వెళ్లారు. తేజశ్వినికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు శంకర్, సిద్దిపేట అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు శేఖర్, బాలకృష్ణ తదితరులున్నారు. 
 

ఏడుపాయల భక్తులతో కిటకిట ..
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గభవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా నదీ పాయల్లో పవిత్ర స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. 

ఓటర్​కార్డుకు ఆధార్​లింక్​ తప్పనిసరి 
కంది, వెలుగు :   ప్రతి ఒక్కరూ ఓటర్​కార్డుకు తప్పనిసరిగా ఆధార్​లింక్ చేసుకోవాలని కంది తహసీల్దార్​విజయలక్ష్మి సూచించారు. ఆదివారం కంది మండలంలోని ఓడీఎఫ్​లో డోర్​టూ డోర్​ ఓటర్​ ఐడీ కార్డుకు ఆధార్​ అనుసంధానం కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి టౌన్​లో నాయబ్​తహసీల్దార్​సాజీద్​ ఆధ్వర్యంలో ఓటర్​కార్డుకు ఆధార్ ను లింక్​చేశారు. 

స్విమ్మింగ్ లో సిద్దిపేట జిల్లాకు 3 పతకాలు 

సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్​ షిప్​ లో సిద్దిపేట జిల్లా కు చెందిన రెడ్డి మల్లెగారి రాజు మూడు పతకాలు సాధించినట్లు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్ల మల్లికార్జున్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్​షిప్​లో రాజు 50 ఫ్రీ స్టైల్ లో బంగారు పతకం, 100 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ ఈవెంట్​లో వెండి పతకం, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్​లో బంగారు పతకం సాధించారు. అతడిని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుండి ప్రవీణ్, డీవైఎస్ ఓ నాగేందర్, స్పోర్ట్స్ క్లబ్ కన్వీనర్ పాల సాయిరాం, వివిధ క్రీడ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కోచులు అభినందించారు. కాగా ఈ రాష్ట్రస్థాయి టోర్నమెంట్​లో జిల్లా నుంచి ప్రకాశ్​గౌడ్, సురేశ్, కనకరాజు, బసవరాజు, అశోక్ పాల్గొన్నారు.

మల్లన్న బంగారు కిరీటం 
టెండర్ దక్కించుకున్న ‘జీఆర్టీ’

కొమురవెల్లి, వెలుగు:  కొమురవెల్లి మల్లికార్జునస్వామి బంగారు కిరీటం టెండర్​ను హైదరాబాద్ కు చెందిన జీఆర్టీ జ్యువలర్స్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా దక్కించుకుందని ఆలయ ఈఓ బాలాజీ ఆదివారం తెలిపారు. స్వామివారికి కిరీటం, కొరమీసం ఒక కిలో 500 గ్రాముల బంగారంతో తయారు చేస్తున్నట్లు చెప్పారు.

ఫ్లెక్సీలు తొలగించినవారిపై చర్యలు తీసుకోవాలి
పటాన్​చెరు, వెలుగు : రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర సందర్భంగా పటాన్​చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని  ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​చార్జి కాట శ్రీనివాస్​ గౌడ్​ స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జోడో యాత్రతో అధికార పార్టీలో దడ పుడుతోందన్నారు.  కాంగ్రెస్​ ఎదుగుదలను భరించలేకనే  తమ ఫ్లెక్సీలను తొలగించడం, కాంగ్రెస్​ పోస్టర్లపై  అధికార పార్టీ పోస్టర్లను అతికించడం లాంటివి చేస్తున్నారని విమర్శించారు. 

పద్మశాలి నిరుపేదలకు సేవ చేసేందుకు సంఘం పని చేయాలి
చేర్యాల, వెలుగు : పద్మశాలి నిరుపేదలకు సేవ చేసేందుకు యువజన సంఘం పని చేయాలని పద్మశాలి సంఘం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు చంద్రయ్య పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని మార్కండేయ హనుమాన్ ​ఆలయంలో జరిగిన చేర్యాల పట్టణ యువజన సంఘం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. కమిటీ మార్కండేయ హనుమాన్​ ఆలయ అభివృద్ధితో పాటు పద్మశాలి సమాజం డెవలప్​మెంట్​కు కృషి చేయాలని కోరారు. అంతుకుముందు యువజన సంఘం అధ్యక్షుడు ఆడెపు మహేశ్, ప్రధాన కార్యదర్శి గోనె శివకుమార్, ఉపాధ్యక్షులు బింగి శ్రీనివాస్, ఇ.రాజశేఖర్, తౌట సాయి, కార్యదర్శులు ఇ.రాజేశ్​, ఎ.భిక్షపతి, కె.నవీన్, బొడ్డు సంతోశ్, కోశాధికారి ఎ. శంకర్, సహాయ కోశాధికారి పి.నాగరాజు కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు డి. వెంకటేశం, కౌన్సిలర్​ ఎ.నరేందర్, ఎ.పవన్ పాల్గొన్నారు. 

తల్లి మందలించిందని కొడుకు సూసైడ్
నర్సాపూర్, వెలుగు : తల్లి మందలించిందని కొడుకు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్ లో ఆదివారం జరి గింది. ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం..  నారాయణఖేడ్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన సోనీ బాయి కుమారుడు లక్ష్మణ్(19) కొంతకాలంగా నర్సాపూర్ పట్టణంలో నివాసం ఉంటూ తాపీ మేస్త్రీగా పని చేసేవాడు. కొన్ని రోజులుగా ఏ పని చేయడం లేదు. ఏదైనా పని చేయాలని లక్మణ్​ను తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మణ్​ యాసిడ్ తాగాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.