
ఢిల్లీ : భారత్, కెనడా మధ్య వాణిజ్య చర్చలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన ట్రెడ్ మిషన్ వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్యమంత్రి మేరీ ఎన్ జీ ప్రతినిధి శాంతి కోసెంటినో చెప్పారు. ఖలిస్థానీ సానుభూతిపరుల ఆగడాలతో భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు పరిష్కారమైన తర్వాతే ఈ చర్చలను పునఃప్రారంభిస్తామని భారత్ స్పష్టం చేసింది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని, సమస్య పరిష్కారమైన తర్వాత చర్చలను మళ్లీ ప్రారంభిస్తామని భారత సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
వాస్తవానికి జీ20 సదస్సుకు కొద్ది రోజుల ముందే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా ప్రకటించింది. వచ్చే నెలలో ఆ చర్చలను తిరిగి ప్రారంభించాల్సి ఉండగా.. ఇప్పుడు మరోసారి వాటికి బ్రేక్ పడింది. అటు కెనడా కూడా ఈ చర్చలపై స్పందించింది. భారత్‌తో అక్టోబరులో జరగాల్సిన వాణిజ్య మిషన్‌ను వాయిదా వేయాలని ఆ దేశ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ నిర్ణయించారు.
ALSO READ: చదువులో ఫెయిల్.. హెలికాప్టర్ తయారీలో సక్సెస్
కెనడాలో ఖలిస్థానీ సానుభూతిపరుల ఆందోళనలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జీ20 సదస్సుకు వచ్చిన ట్రూడోతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత్ వ్యతిరేక శక్తులు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, అది కెనడాకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. భారత రాయబార కార్యాలయాలు, భారత దౌత్యవేత్తలపై దాడులు, భారతీయులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్- కెనడా దౌత్య సంబంధాల పురోగతిలో పరస్పర గౌరవం, విశ్వాసం చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు.
అయితే.. తమ దేశం శాంతియుత నిరసనలు తెలిపే స్వేచ్ఛను కాపాడుతుందని, అదే సమయంలో హింసను అడ్డుకుంటుందని చెప్పారు కెనడా ప్రధాని ట్రూడో. భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేసి, ఖలిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా కొందరు సిక్కులు కెనడాలో ఆందోళనలు చేస్తున్నారు. ఖలిస్థాన్ రెఫరెండం పేరుతో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే... ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదుల నిరసనలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.