నాలుగు లేబర్ ​కోడ్ ల అమలును అడ్డుకుంటాం : జేఏసీ

నాలుగు లేబర్ ​కోడ్ ల అమలును అడ్డుకుంటాం : జేఏసీ
  • కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోంది 

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/ములకలపల్లి, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. నాలుగు లేబర్​ కోడ్​లను అమలును అడ్డుకుంటామని, వెంటనే వాటిని విరమించుకోవాలన్నారు. ఈ విషయమై కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్​ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ టౌన్​ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలంలో అమరవీరుల స్తూపం వద్ద నాయకులు నిరసన తెలిపారు. ములకలపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ గున్యాకు వినతిపత్రం అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టేందుకు బీజేపీ సర్కార్​ పన్నుతున్న కుట్రలను కార్మికులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్​ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. కొత్తగూడెంలో పట్టణ కన్వీనర్​ బండారు శరత్​బాబు, నాయకులు గడ్డం స్వామి, భూక్యా రమేశ్, గుడెల్లి యాకయ్య, రవి కుమార్, తాండ్ర విజయ్​, ములకలపల్లిలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నరాటి రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ ధనలక్ష్మి పాల్గొన్నారు.