ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ట్రేడర్లు, దడువాయిల ఇష్టారాజ్యం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ట్రేడర్లు, దడువాయిల ఇష్టారాజ్యం

ఖమ్మం/ ఖమ్మం టౌన్,వెలుగు:  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ట్రేడర్లు, దడువాయిల ఇష్టారాజ్యం నడుస్తోంది. మిర్చి కొనుగోళ్లలో ఆర్డీ(రేట్ డిఫరెన్స్) పేరుతో దందా కొనసాగిస్తున్నారు. దీనికి మార్కెటింగ్ శాఖ అధికారులు, పాలకవర్గం సపోర్ట్ ఉండడంతో ఎవరైనా ఫిర్యాదు చేసినా ఒకట్రెండు రోజులు ఆపి, మళ్లీ కంటిన్యూ చేస్తున్నారు. గురువారం రైతుల నుంచి ‘ఏ’ గ్రేడ్ మిర్చిని రూ.20,800లకు కొనుగోలు చేసిన తర్వాత, కాంటాల వేసేటప్పుడు దడువాయి రూ.7500 కు విక్రయం జరిగినట్లు పీవోఎస్ మిషన్ నుంచి బిల్లు ప్రింట్ చేసిన తీశారు. తాలు కూడా రూ.12 వేల రేటు చొప్పున కొంటుండగా, అంతకంటే తక్కువ ధరకు బిల్లు ఇవ్వడంతో కమీషన్​దారుడు, రైతు కలిసి దడువాయిని నిలదీశారు. తక్కువ రేటుకు బిల్లు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించగా, ఇదంతా ఇక్కడ కామన్ అంటూ చెప్పాడు.  పంట ఖరీదు చేసిన రేటుకు బిల్లు ఇవ్వాలని కోరినా నిరాకరించడంతో కమీషన్‌దారుడు అశోక్ గురువారం మార్కెట్ సెక్రటరీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 

ఆర్డీ, జీరో దందాపై ఫిర్యాదులు 

మార్కెట్‌లో పంటను కొనుగోలు చేసిన ఖరీదుదారుడి సమక్షంలో, దడవాయిలు బస్తాలు తూకం వేసి పీవోఎస్ మిషన్ లో నమోదు చేయాలి. ఖమ్మంలో రూల్స్​విరుద్ధంగా ఖరీదుదారులు లేకుండానే ఇష్టారాజ్యంగా బస్తాల లెక్క నమోదు చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి మిర్చి మార్కెట్‌లో ఆర్డీ, జీరో దందాపై ఫిర్యాదులు వస్తున్నాయి. గత నెలలో ఆర్డీ ఆరోపణలు రావడం, ఫిర్యాదులు అందడంతో ఖమ్మం మార్కెట్ నుంచి లోడ్‌తో బయటకు వెళ్లిన మూడు లారీలను జీఎస్టీ అధికారులు పట్టుకొని రూ.రెండున్నర లక్షల చొప్పున ఫైన్​వేశారు. డ్రై మిర్చీని కొనుగోలు చేసి తాలు పేరుతో బిల్లులు చూపిస్తూ మార్కెట్ ఫీజు, జీఎస్టీని ఎగ్గొడుతుండడంపై చర్యలు తీసుకున్నారు. దీనిపై కంప్లైంట్ వచ్చినప్పుడే హడావుడి చేస్తున్న ఆఫీసర్లు, పాలకవర్గం ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఆర్డీ దందా నడిపిస్తున్నందుకు దడువాయిలకు బస్తాకు రూ.10, బస్తాల లెక్క తక్కువగా నమోదు చేస్తే మార్కెట్ సెక్యూరిటీ గార్డ్, సూపర్ వైజర్, యార్డ్ ఇన్‌చార్జి నుంచి ఆఫీసర్ల వరకు ప్రతి బస్తాకు రూ.30 చొప్పున వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

సర్కార్​ ఆమ్దానీకి గండి 

ఇతర రాష్ట్రాలకు మిర్చి ఎక్స్​పోర్ట్​చేసే వ్యాపారులు దందాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఖరీదు రేటును తక్కువగా చూపించడం ద్వారా ఆ తక్కువ రేటుకే  జీఎస్టీ, మార్కెట్ సెస్ కడుతున్నారు. దీంతో సర్కార్​ ఆదాయానికి గండి పడుతోంది. ఈ అక్రమ వ్యాపారంపై మార్కెట్ శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టి పెట్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. 

ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: 

మార్కెట్‌లో ఎక్కువ రేటుకు కొని, తక్కువ రేటుకు బిల్లు ఇచ్చిన ఘటనపై ఎంక్వైరీ చేస్తాం. మార్కెట్ సెక్రటరీకి కమీషన్‌దారుడు కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. దీనిపై కూడా విచారణ చేసి, తప్పని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.  

- నాగరాజు, 
జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి