
‘సమాజంలో నిజాయితీగా వ్యాపారం చేసి నిలబడలేం’ అనే భావన పెరుగుతుండడం దురదృష్టకరం. ఈ భావనే కల్తీ వ్యాపారం పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది. వ్యాపారం అనేది మన సమాజ అభివృద్ధికి ప్రాణాధారం. మనిషి అవసరాలను తీర్చుకోవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం.. ఇవన్నీ వ్యాపారం ద్వారా సాధ్యమవుతాయి. ప్రాచీన కాలంలో వస్తువులను వస్తువులతో మార్చుకునే బార్టర్ సిస్టమ్ ఉండేది.
కాలక్రమేణా నాణేల వాడకం, తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ, చివరకు డిజిటల్ లావాదేవీలు వెలిశాయి. కానీ, వ్యాపారం అసలు సారం మాత్రం ఒకటే. అది- మనిషి అవసరాలను తీర్చడం. నిజాయితీగల వ్యాపారులు సంపద సృష్టికర్తలు. వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాదు. సమాజానికి సేవ చేస్తూ, నైతిక విలువలను కాపాడుతూ సాగితేనే అది నిజమైన, ఆదర్శవంతమైన వ్యాపారం అవుతుంది. నైతిక విలువలు వ్యాపారానికి మూలస్తంభాలు. అలా జరిగితేనే వ్యాపారం మానవ సమాజానికి శాశ్వతమైన శక్తి అవుతుంది.
వ్యాపారంలో లాభనష్టాలు సహజం
లాభం ఆశించడం తప్పుకాదు. కానీ, అది న్యాయబద్ధమైన మార్గాల్లో రావాలి. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. మార్కెట్ ఎగుడుదిగుడులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలు ఎదురైనప్పుడు నిరుత్సాహానికి గురి కాకుండా మళ్ళీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారులు. నిజమైన వ్యాపారి ఓటమిని అవకాశంగా మలుచుకుంటాడు. ఒకే తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడటమే నిజమైన వ్యాపారి చతురత. కానీ, అవినీతి ప్రభుత్వాలు, రాజకీయ గూండాల ఆధిపత్యం, చౌక వస్తువుల కోసం ఆరాటపడే కస్టమర్ల వంటి కారణాల వల్ల కల్తీ వ్యాపారం పెరుగుతోంది.
నిజాయితీగా వ్యాపారం చేసినవారు పోటీ తట్టుకోలేక వెనకబడుతున్నారు. ఇది సమాజానికి హానికరం. ఇటీవలి కాలంలో చెన్నై కస్టమ్స్ వద్ద జరిగిన విన్‌ట్రాక్ ఇన్‌క్ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, అధికారుల నిర్లక్ష్య ధోరణి, అలసత్వం కారణంగా కంపెనీ దిగుమతులు వారాల తరబడి నిలిచిపోయాయి. ఈ అన్యాయంపై ఆ కంపెనీ భారతదేశంలో వ్యాపారం నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వ్యాపార వాతావరణంపై తీవ్ర ఆందోళన కలిగించింది.
సమాజానికి వ్యాపారులు అవసరం
నిజాయితీగా వ్యాపారం చేసే సంస్థలు ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోవడం దురదృష్టకరం. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకత, సమయపాలనతో వ్యవహరిస్తేనే వ్యాపార విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అయితే, భారతదేశంలో చాలాకాలం నుంచి ‘డబ్బు ఉన్నవారు అంటే దోపిడీ చేసేవారు’ అని, డబ్బు లేనివాడు పేదవాడు, నిజాయితీపరుడు అనే అభిప్రాయం సామ్యవాదం పేరుతో విస్తరించింది. ఇది ఒక తప్పుడు దృక్పథం. సామ్యవాదం పేరుతో వ్యాపారులను తక్కువ చేయడం ఒక తప్పు భావజాలం.
మన దేశంలో సామ్యవాద భావనను అనుసరించడం సమాజ అభివృద్ధికి అవసరం. కానీ, కొంతమంది బ్యూరోక్రాట్లు ఈ భావనను తప్పుగా అర్థం చేసుకుని, నిజాయితీతో వ్యాపారం చేస్తున్న సంస్థలకు అవివేకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఉద్యోగులు సమాజానికి ఎంత అవసరం ఉందో, వ్యాపారులు కూడా అంతే అవసరం. రెండు వర్గాలు కలిసి నడిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది.
నకిలీ ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలి
ప్రకృతిలో లభించే అనేక రకాల ఆహార ఉత్పత్తులను నిల్వచేసే విధానాల్లో, రవాణా ప్రక్రియలో కొన్ని తయారీ సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాణ్యతను తగ్గిస్తూ, వినియోగదారులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్నాయి. న్యాయస్థానాలు పలు సందర్భాల్లో తమ బ్రాండ్ పేర్లను వాడుకొని నకిలీ ఉత్పత్తులు విక్రయించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించాయి. అటువంటి మోసపూరిత వ్యాపారాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించాయి.
రాజకీయ నాయకులు వ్యాపారాలను చూసే దృక్పథం మారాలి. వ్యాపారులపై అనుమానం లేదా దోపిడీ దృష్టితో కాకుండా, ఆర్థికాభివృద్ధి భాగస్వాములుగా చూడాలి. స్టార్టప్‌ల పరిధిలో తరచుగా బ్యూరోక్రటిక్ అడ్డంకులు ప్రధాన సమస్యగా నిలుస్తున్నాయి. అనవసరమైన పత్రాలు, అనుమతుల ఆలస్యం, ఫైల్ ప్రాసెసింగ్‌లో నిర్లక్ష్యం, జాప్యం వంటి అంశాలు యువ వ్యాపారులకు కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో ఆర్థికభారాన్ని కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలి.
సోమ శ్రీనివాస్ రెడ్డి
సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్