కార్బైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మామిడి కాయల్ని మగ్గపెడుతున్న వ్యాపారులు..

కార్బైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మామిడి కాయల్ని మగ్గపెడుతున్న వ్యాపారులు..
  • నిషేధిత కార్బైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాయల్ని మగ్గపెడుతున్న వ్యాపారులు
  • పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ అధికారులు
  • పక్వానికి రాని పండ్లు తింటే డేంజర్ అంటున్న డాక్టర్లు
  • బాటసింగారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే 10 వేల టన్నులు
  • గతేడాది మార్చిలో వచ్చింది 1,360 టన్నులే

హైదరాబాద్, వెలుగు:సీజన్ మొదలు కాకముందే మామిడి పండ్లు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటెత్తుతున్నాయి. నెల రోజులుగా లోడ్లకు లోడ్లు వస్తున్నాయి. పక్వానికి రాకముందే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి, మందులు మాకులతో వ్యాపారులు మాగబెడుతున్నారు. ఇదంతా తెలియక కొంటున్న జనం.. పండ్లు పచ్చిగా ఉంటున్నాయని లేదా అసలు రుచి ఉండటం లేదని చెబుతున్నారు. మరోవైపు నిషేధిత కార్బైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాగబెడుతున్నవాటిని తింటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యాపారులు విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 

వ్యాపారుల అతి జాగ్రత్త!


ఏప్రిల్ రెండో వారం తర్వాత రావాల్సిన పండ్లు మార్చి నుంచే కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.నిజానికి మామిడి పండ్లకు మే నెల అసలైన సీజన్ అని చెబుతారు. కానీ వాతావరణ మార్పులు, రైతులు/వ్యాపారుల అతి జాగ్రత్త కారణంగా సీజన్​కన్నా ముందే భారీ ఎత్తున కాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలకు కొన్ని కాయలు రాలిపోగా, మిగతావి కూడా పాడవుతాయని వాటిని కూడా తెంపి మరికొందరు మార్కెట్లకి తరలించారు. చెట్లకు కాత, పూత, పిందెలు ఏకకాలంలో కనిపించడంతో ఎందుకైనా మంచిదని, ఉన్న కాయల్ని తెంపి ఇంకొందరు అమ్మేశారు. ఇలా ఈ ఏడాది మార్చిలో బాటసింగారంలోకి హోల్ సేల్ మార్కెట్‌‌కి 10 వేల టన్నుల వరకు మామిడికాయలు వచ్చాయి. కానీ గతేడాది మార్చి నెలలో మార్కెట్‌‌కు వచ్చింది 1,360 టన్నులు మాత్రమే. అలా ఒక్కసారిగా వచ్చిన కాయల్ని తొందరగా వదిలించుకునేందుకు వ్యాపారులు వాటిని కాల్షియం కార్బైడ్ లాంటి నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. కాయలకు పచ్చని రంగు వచ్చేలా చేస్తున్నారు.

దెబ్బకొట్టిన​అధిక  వర్షాలు

మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభా వం చూపాయి. సాధారణంగా జూన్, జులైలో వర్షాలు ప్రారంభమై.. ఆగస్టు, సెప్టెంబర్‌‌ వరకు కురుస్తాయి. కానీ, గత ఏడాది అక్టోబర్ దాకా అధిక వర్షాలు కురి శాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరకపోవడంతో చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత కొన్నిచోట్ల ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి.. ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. అలాగే, చలి కాలంలోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం మామిడి పంటపై ప్రభావం చూపినట్లు అధికారులు చెబుతున్నారు.  

అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే

మామిడి కాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ లాంటి విష రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వీటివల్ల క్యాన్సర్ తోపాటు కిడ్నీ, లివర్ సమస్యలు తలెత్తే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్‌‌తో కృతిమంగా తయారు చేసిన పండ్లను తీసుకోవడం చాలా డేంజర్ అని, ఊబకాయం, గ్యాస్ర్టిక్ సమస్యలు వస్తాయని, మలబద్ధకం,చర్మ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. కెమికల్స్‌‌తో మాగబెట్టిన పండ్లను తింటే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లేనని స్పష్టం చేస్తున్నారు.

30 శాతం తగ్గనున్న దిగుబడి

రాష్ట్రవ్యాప్తంగా మూడున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు కొనసాగుతున్నట్లు హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. మొత్తం 11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ మంచు, వడగండ్ల వర్షాలతో పూత, పిందె, కాయలు రాలిపోయాయి. దీంతో ఇందులో 20 నుంచి 30 శాతం దిగుమతి తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే 15 శాతానికి పైగా మార్కెట్లకి వచ్చింది. మొత్తంగా మార్కెట్ యార్డులకి వచ్చేది కేవలం లక్షా 20 వేల టన్నుల మామిడి మాత్రమే. మిగతాది నేరుగా రైతుల నుంచి వేరే రాష్ట్రాలకు, బయటి మార్కెట్లకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌‌నగర్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట్ నుంచి ఎక్కువ పంట వస్తుంది.

అధికారులు పట్టించుకోవట్లే

రెయిన్​బజార్, మొఘల్​పుర, భవానీనగర్, లంగ ర్ హౌస్ తదితర ప్రాంతాల్లో మామిడి పండ్ల గోదాము లు ఏర్పాటు చేసి పండ్లను మగ్గిస్తున్నారు. మామిడి పండ్లతో పాటు సీజనల్ పండ్లపై రసాయనాలు చల్లి మగ్గిస్తుంటారు. గతంలో పలు గోదాములపై రైడ్స్ నిర్వహించిన పోలీసులు అనేక మందిపై కేసులు బుక్ చేశారు. అయినప్పటికీ సీజన్‌‌ను బట్టి రెచ్చిపోతున్న ఫ్రూట్ కెమికల్ మాఫియా.. క్యాల్షియం కార్బైడ్, ఎథోఫాన్, బిగ్‌‌ఫాన్ లాంటి రసాయనాలతో పాటు చైనా నుంచి వస్తున్న కెమికల్ చల్లి రెండు రోజుల్లోనే పచ్చిమామిడి కాయలకు రంగు రప్పిస్తున్నారు. పండ్లు సహజత్వం కోల్పోయి విషపూరితంగా మారుతున్నాయి. ఇలాంటి పండ్లు తిన్నవారి ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అసలు పట్టించుకోవడంలేదు.

ఆరు రెట్లు ఎక్కువ

గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి 6 రెట్లు ఎక్కువ మామిడి మార్కెట్‌‌కు వచ్చింది. మహబూబ్​నగర్, సూర్యాపేటతో పాటు ఏపీ, కర్నాటక నుంచి వస్తోంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో కార్బైడ్ పూర్తిగా బ్యాన్ చేశాం. వర్షాలు పడుతాయని కాయలు ముందుగా తెంపి మార్కెట్ కి తీసుకురావడం వల్ల ధరలు తగ్గే ప్రమాదం ఉంది. రైతులు మార్కెట్‌‌ను సంప్రదించి తీసుకొస్తే మంచి ధరలు వచ్చే అవకాశముంది.
- నర్సింహారెడ్డి సెక్రటరీ,  బాటసింగారం మార్కెట్

వాతావరణ మార్పులతో విచిత్ర పరిస్థితులు

వాతావరణ మార్పులతో ఈ సారి విచిత్రమైన పరిస్థి తులు కనిపిస్తున్నాయి. కొన్ని చెట్లకు కాయలతో పాటు పిందె, పూత కూడా ఉంటున్నాయి. అక్టోబర్ వరకు వర్షాలు పడటం, చలికాలంలో ఎక్కువగా చలి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సారి 20 శాతం దిగుమతులు తగ్గుతాయి. మామిడి కాయల్లో ఇథలిన్  వాడవచ్చు. కానీ క్యాల్షియం కార్బైడ్ వాడొద్దు.

- సునంద రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా

రసాయనాలతో డేంజర్

కెమికల్స్‌‌తో కృతిమంగా తయారు చేసిన పండ్లను తీసుకోవడం చాలా డేంజర్. ఊబకాయం, గ్యాస్ర్టిక్ సమస్యలు, చర్మ వ్యాధులు వస్తాయి. లీవర్ ప్రాబ్లమ్స్‌‌ ఎదురవుతాయి. పేగుల్లో క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. కంటిన్యూగా ఇలాంటి ఫ్రూట్స్‌‌ తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. 
- డాక్టర్ విజయభాస్కర్, ఎథిక్స్ కమిటీ  చైర్మన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్

అన్‌‌ సీజనల్ పండ్లతో ప్రమాదమే

అన్‌‌సీజనల్‌‌గా వచ్చిన పండ్లతో ప్రమాదమే. అందుకే వర్షాలు ప్రారంభమైన తర్వాత (జూన్​ నెలలో) వచ్చే పండ్లను కూడా తినవద్దని డాక్టర్లు చెబుతారు. అంటే సీజన్​కన్నా ముందు వచ్చినా, లేట్ సీజన్​లో వచ్చినా తినడం అంత మంచిది కాదు. నిజానికి మామిడి సీజన్ యేటా ఏప్రిల్ 15 తర్వాత ప్రారంభమవుతుంది. ఏప్రిల్, మే నెలలు సరైన సీజన్.
-