సన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

సన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఖరీఫ్ ​వడ్లకు మంచి ధర పలుకుతోంది. మద్దతు ధర రూ. రెండు వేల వరకు ఉండగా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు రూ. 2,400 వరకు చెల్లిస్తున్నారు. నేరుగా కల్లాల దగ్గరకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్​లో వరి సాగు పెరగడంతో డిమాండ్​ తగ్గుతుందని అంతా భావించారు. కానీ తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు మన వడ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం రైతులకు లాభసాటిగా మారింది. గతంలో  ధాన్యం క్రయవిక్రయాలు ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరిగేవి. గతేడాది నుంచి  కొనుగోళ్లలో సర్కారు స్వేచ్ఛ కల్పించింది. వ్యాపారులు,  రైతులు ఎక్కడైనా క్రయ విక్రయాలు జరపవచ్చు. దీంతో ఈసారి  అనూహ్య రీతిలో వడ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. 

మద్దతు కంటే రూ. 300 ఎక్కువ

ఈ సీజన్ లో  వడ్లకు క్వింటాల్ ధర రూ.2,020, సాధారణ రకం రూ.2000గా సర్కారు నిర్ణయించింది. బోధన్,​ బాన్స్​వాడ డివిజన్​ పరిధిలో సెప్టెంబర్​ చివరివారంలో వరికోతలు ప్రారంభం కాగానే  పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వడ్ల కొనుగోళ్లు చేపట్టారు. ప్రధానంగా తమిళనాడు , మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. నవంబర్​ చివరి వారం నుంచి డిసెంబర్​ నెలాఖరు వరకు ఆయా రాష్ట్రాల్లో వరికోతలు ఉంటాయి. వాటిని మరాడించి అమ్మాలంటే మార్చి రావాలి.  దీంతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు మన ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. డబ్బులు 20 రోజుల్లోపు  రైతుల ఖాతాల్లో  జమ చేస్తున్నారు.  

రష్​ లేని వడ్ల సెంటర్లు 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్​లో 16 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  ధాన్యం ఉత్పత్తిలో,  సేకరణలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా  గత రెండేళ్లుగా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈసారి కూడా ఉత్పత్తి జరిగినా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేపట్టడంతో సర్కార్​పై భారం తగ్గనుంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రధానంగా తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకునేవారు. పొరుగు రాష్ట్రాల వ్యాపారులు తేమను పట్టించుకోకుండా పచ్చి ధాన్యాన్ని కూడా గరిష్ఠ ధరకు కొంటున్నారు. దీంతో కొనుగోలు సెంటర్ల లో రష్​ తగ్గింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 8 ‌‌‌‌పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 8 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4 లక్షల టన్నులు సేకరించాలని  లక్ష్యంగా నిర్ణయించారు. కానీ వడ్ల సెంటర్లలో  రూ. 2,060 ధర ఉండగా బహిరంగ మార్కెట్ లో  క్వింటాలు రూ.2,400 వరకు లభిస్తోంది. తరుగు తీయకపోవడంతో రైతులకు మరింత లాభం కలుగుతోంది. దొడ్డురకం క్వింటాలు రూ.2,100 నుంచి రూ.2,200 వరకు ప్రైవేట్ వ్యాపారులు చెల్లిస్తున్నారు. 

కల్లాల దగ్గరికే వస్తున్రు 

కల్లాల్లోనే కొనుగోలు చేయడంతో  గిట్టుబాటు ధర దక్కుతోంది. ఈ సీజన్​లో వరి సాగు పెరగడంతో ధర రాదనుకున్నాం. వ్యాపారులు వచ్చి  నేరుగా కొనడంతో రవాణా ఖర్చు సైతం తగ్గుతోంది. తరుగు లేకుండా కొనడంతో  రూ. 300 దాకా మద్దతు కంటే ఎక్కువగా వస్తోంది. 

- జగన్,​ రైతు, మోపాల్​