షాపులొచ్చిన సంబురం.. తప్పని వార్నింగ్‌లు

షాపులొచ్చిన సంబురం.. తప్పని వార్నింగ్‌లు

సిండికేట్​ కావాలంటూ డ్రాలో వైన్స్​ దక్కించుకున్నోళ్లకు హెచ్చరికలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పది రోజుల కింద ఎక్సైజ్ డిపార్ట్​మెంట్​ తీసిన డ్రాలో వైన్స్​దక్కించుకున్న వారి సంబురం అప్పుడే ఆవిరవుతోంది. డిసెంబర్​ ఒకటో తేదీ నుంచి కొత్త లిక్కర్​ షాప్​లు ఓపెన్ ​కానుండడంతో సిండికేట్ ​కావాలంటూ పాత వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారు. కొత్తగా షాపులు దక్కించుకున్నవారికి ఎమ్మెల్యేలు, ఎక్సైజ్​ ఆఫీసర్లతో ఫోన్లు చేయిస్తున్నారు. వినకపోతే తిప్పలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. 

సిండికేట్​ అయితే ఇబ్బందులుండవ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులుండగా, ప్రతి నెల రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు పైగా లిక్కర్ ​బిజినెస్ ​సాగుతోంది. రెండు రోజుల్లో కొత్త షాపులు షురూ కానుండగా వైన్స్​దక్కించుకున్న వారికి ఎక్సైజ్ ​శాఖ లైసెన్స్​లు  కూడా ఇష్యూ చేస్తోంది. డ్రాలో కొత్తవారికి ఎక్కువగా షాప్​లు దక్కడం, పాత వారికి ఒకటీ రెండు రావడంతో ఆదాయం కోల్పోతామని భావిస్తున్నారు. గతంలో సిండికేట్​గా ఉన్నప్పుడు బెల్ట్​షాపులకు లిక్కర్ ​సప్లై చేస్తూ ఎక్స్​ట్రా ఇన్​కం పొందేవారు. వైన్స్​ కాకుండా అదనంగా స్టోర్స్​ఏర్పాటు చేసుకుని  అక్కడి నుంచే బెల్ట్​షాపులకు మద్యం తరలించేవారు. ఒక్కో బాటిల్​పై రూ.15 వరకు ఎక్కువ తీసుకునేవారు. ఇప్పుడు సంపాదన తగ్గే అవకాశం ఉండడంతో కొత్తవారికి సిండికేట్​ కావాలని సూచిస్తున్నారు. అయినా కొత్తగూడెం సర్కిల్​తో పాటు ఇల్లెందు,  పాల్వంచ, అశ్వారావుపేట, భద్రాచలం లాంటి ప్రాంతాల్లో కొత్తవారు వినడం లేదు. దీంతో ఎక్సైజ్​ఆఫీసర్లతో, లోకల్​ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయిస్తున్నారు. 

‘పాత వారితో ఎందుకు గొడవ. అందరూ సిండికేట్​అయ్యి ఇబ్బందుల్లేకుండా బిజినెస్​ చేసుకోండి. లేకపోతే మీకు ఇబ్బందులు తప్పవు’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బెల్ట్​ షాప్​ల ద్వారానే ఎక్కువగా అమ్మకాలు సాగుతుండడంతో ఎక్సైజ్​ఆఫీసర్లు కూడా పట్టించుకోవడం లేదు. అమ్మకాల టార్గెట్ ​రీచ్​కావడమే తమ లక్ష్యమని, ఇవన్నీ చిన్న చిన్న విషయాలని ఆఫ్​ది రికార్డుగా చెబుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొంతమంది లొంగిపోతుండగా, మరికొందరు షాపులు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంతమంది సొంతంగా నే నడుపుకుంటామని ఖరాకండిగా చెబుతున్నారు. దీంతో వీరికి షాప్​లు రెంట్​కు దొరకకుండా చేస్తున్నారు. ఓనర్లతో మాట్లాడి రెంట్​ఎక్కువ డిమాండ్​ చేయాలని సూచిస్తున్నారు. రెంట్​ఎక్కువైనా పర్వాలేదని తీసుకుంటుంటే ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్లు దొరకకుండా చేసేందుకు ప్లాన్ ​చేస్తున్నారు.