రాష్ట్రమంతా కుండపోత.. అనేక గ్రామాలకు రాకపోకలు బంద్​

రాష్ట్రమంతా కుండపోత..  అనేక గ్రామాలకు రాకపోకలు బంద్​

నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రమంతా మంగళవారం భారీ వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో వాగులు పొంగిపొర్లడంతో  అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల్లో  కొట్టుకుపోయి ఇద్దరు యువతులతో సహా ముగ్గురు చనిపోగా ఇద్దరిని   పోలీసులు కాపాడారు. దవాఖానలో చెకప్​ కోసం  బయలుదేరిన ఒక గర్భిణిని స్థానికులు అతికష్టం మీద వాగు దాటించారు.  

వేల్పూరులో 43 సెంటీమీటర్ల వాన 

గడిచిన 24 గంటల్లో నిజామాబాద్​ జిల్లా వేల్పూరు మండలంలో  43 సెంటీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.  భీంగల్ లో  24.7,   జక్రానపల్లిలో 22.6 సెంటీమీటర్లు,  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో 17 సెంటీమీటర్లు,  వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో 18 సెంటీమీటర్లు, వర్ధన్నపేట లో 17.7 సెంటీమీటర్లు,   సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 15,   అక్కన్నపేటలో 12.2 సెంటీ మీటర్ల వర్షం పడింది.  భారీ వర్షాల కారణంగా వరంగల్​లోని సుమారు 30 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాయం కోసం బిల్డింగులపైకి ఎక్కిన మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఎన్​డీఆర్​ఎఫ్​ టీమ్​లు, వరంగల్​ పోలీసులు కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖమ్మం– వరంగల్​ రోడ్డుపై ట్రాఫిక్​ స్తంభించింది. హైదరాబాద్​లో  కురిసిన భారీవానల  కారణంగా యాదాద్రి జిల్లాలో మూసీనదికి  వరద పోటెత్తింది. దీంతో బీబీనగర్,  పోచంపల్లి, భువనగిరి, చౌటుప్పల్ మధ్య రాకపోకలకు ఆటంకం కలిగింది.  నిర్మల్​ జిల్లా కడెంలోకి వరద పోటెత్తడంతో  ఐదు గేట్లు ఎత్తి  25, 774 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్ట్ ఒక గేట్ ఎత్తి  వెయ్యి క్యూసెక్కుల నీటిని,  గడ్డెన్న ప్రాజెక్ట్  నుంచి  ఎనిమిది వేల క్యూసెక్కు ల నీటిని వదిలేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 75 గేట్లు తెరిచి 5.61 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెడ్తున్నారు. మహబూబాబాద్​ జిల్లాలో ఆకేరు , పాలేరు, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్​ జిల్లా వేల్పూరులోని ముసలిగుంట చెరువు కట్ట తెగి గ్రామంలోకి నీరు ప్రవేశించింది. పోలీస్ స్టేషన్,  తహసీల్దార్ ఆఫీస్,  వీడీసీ కాంప్లెక్సుల్లోకి నీళ్లు చేరాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు  బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తుండడంతో  సిద్దిపేట, హన్మకొండ మధ్య  రాకపోకలను నిలిపివేశారు. హుస్నాబాద్ లో  మెయిన్ రోడ్డు నీట మునిగింది. సిరిసిల్ల జిల్లాలోని  ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి మత్తడి దూకుతోంది.  వనపర్తి జిల్లా పెబ్బేరు దగ్గర జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువకు గండి పడింది.  

ALSO READ:ఎయిర్​పోర్టులో 700 గ్రాముల గోల్డ్ సీజ్

గర్భిణి అవస్థలు

ఆదిలాబాద్ జిల్లా బజార్​హత్నూర్ మండలం కొత్తపల్లికి చెందిన  గర్భవతిని గ్రామస్తులు అతికష్టం మీద వాగు దాటించారు.  భారీవర్షాలతో  కొత్తపల్లి వాగు ఉప్పొంగడంతో  ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.  గ్రామానికి చెందిన  పూసం భారతి అనే ఆరు నెలల  గర్భిణి   నడుము, కడుపునొప్పితో బాధపడుతూ బజార్​హత్నూర్ పీహెచ్​సీకి బయలుదేరింది. వాగు పొంగడంతో ఆమెను గ్రామస్తులు నానా పాట్లు పడి దాటించాల్సి వచ్చింది.

పొలం పనులకు వెళ్తుంటే  ప్రాణాలు పోయినయ్​

 మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన ఇద్దరు యువతులు వాగులో కొట్టుకుపోయి చనిపోయారు.  గ్రామానికి చెందిన పడకండి  కేశవులు కూతురు స్వాతి(18), పడకండి మల్లయ్య కూతురు అనూష(18) ఉదయం  పొలానికి బయలుదేరారు. దుందుభి వాగు ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నిస్తుండగా  జారి పడి కొట్టుకుపోయారు.  గ్రామస్తులు వాగులో వెతకగా కొంత దూరంలో వారి శవాలు కనిపించాయి.  ములుగు జిల్లా వెంకటాపురం మండలం  సీతారాంపురం గ్రామానికి చెందిన బొగ్గుల బొండయ్య( 55) అనే గిరిజనుడు పెద్ద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు.   జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామానికి చెందిన మారుతి  మంగళవారం  వేములవాడ దగ్గర మూలవాగులో పడిపోగా పోలీసులు తాళ్ల సహాయంతో కాపాడారు.  దాదాపు నాలుగు గంటలపాటు వాగు మధ్యలో చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురుచూశాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేములవాడ టౌన్​  సీఐ కర్ణాకర్, సిబ్బంది వచ్చి అతన్ని కాపాడి  ఏరియా దవాఖానకు తరలించారు.  బెల్లంపల్లి మండలం నెన్నెల లంబాడితండా ఎర్రవాగు దాటేందుకు ప్రయత్నించిన కొత్తని సమ్మయ్య అనే రైతు వరదలో  కొట్టుకుపోయాడు.   పోలీసులు అక్కడున్న యువకుల సాయంతో ఆ రైతును కాపాడారు. కొద్దిదూరం కొట్టుకుపోయి ఓ పైపులో ఇరుక్కున్న సమ్మయ్యను  యువకులు అతికష్టం మీద బయటకు తీశారు.  

నడుము లోతు నీటిలో శవయాత్ర

చేర్యాల, వెలుగు : భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి వద్ద వాగు పొంగి పొర్లగా లో లెవెల్ ​బ్రిడ్జిపై నుంచి  రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఒకరు చనిపోగా దహన సంస్కారాలకు బంధువులు కష్టాలు పడాల్సి వచ్చింది. వేచరేణి గ్రామానికి చెందిన బస్వరాజు బాలయ్య మంగళవారం చనిపోయాడు. వాగు అవతలి వైపు వైకుంఠధామం ఉండడం, వర్షాలకు వాగు పొంగడంతో బాలయ్య బంధువులు నడుము లోతు నీళ్లలో శవాన్ని మోసుకుంటూ వైకుంఠధామానికి  తీసుకువెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. వాగుపై ఏర్పాటు చేసిన లో లెవెల్​బ్రిడ్జి మూడేండ్ల కింద భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దానికి రిపేర్లు చేయించాలని గ్రామస్తులు ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం కూడా బీజేపీ ఆధ్వర్యంలో బ్రిడ్జికి రిపేర్లు చేయాలని నిరసన తెలిపారు.