
- పెద్దాసుత్రి ముందు ఇష్టారీతిన అంబులెన్స్‌లు.. ఆటోల పార్కింగ్
- బస్టాండ్‌లో జనాల తాకిడితో రోగులకు ఇబ్బందులు
- ఎదురుగా మున్సిపల్ ఆఫీస్, చిరు వ్యాపారుల బండ్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దాసుత్రి, పాత బస్టాండ్, మున్సిపల్ ఆఫీస్‌లకు వెళ్లేందుకు దాదాపు ఒకే దారి ఉండడంతో ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు. పెద్దాసుపత్రికి వెళ్లే దారిలో ఇష్టారీతిన అంబులెన్స్‌లు, ఆటోల పార్కింగ్‌తో రోగులు అవస్థలు పడుతున్నారు. పాత బస్టాండ్ నుంచి హాస్పిటల్ వరకు బస్సుల రాకపోకలు షరామామూలే. మరోవైపు రోగుల సహాయకులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. హాస్పిటల్‌కు ఎదురుగా మున్సిపాలిటీ ఆఫీస్, చిరు వ్యాపారుల బండ్లు ఉండడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు, ప్రయాణికులు, మున్సిపల్ కార్యాలయ పనుల కోసం వచ్చే సిటీ జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌లు హాస్పిటల్ గేటు చేరడం కష్టంగా మారింది.
బస్టాండ్ తరలించాలని డిమాండ్
జిల్లా కేంద్రంగా మారాక జగిత్యాల వేగంగా అభివృద్ధి చెందుతోంది. హాస్పిటల్ సేవలూ మెరుగవుతున్నాయి. పట్టణ జనాభా లక్షకు పైగా ఉండగా.. ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 5 నుంచి 10వేల మంది
వరకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరిని తరలించే వాహనాలతో రద్దీ పెరుగుతోంది. జనాభా తాకిడికి తగ్గట్టుగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పాత బస్టాండ్‌ను పట్టణ శివారుకు తరలించి, హాస్పిటల్ రోడ్డును విస్తరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.