నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి K 1  కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో విషాదం చోటు చేసుకుంది.  బౌట్లో ప్రత్యర్థి పంచుల వర్షం కురిపించడంతో ఓ కిక్ బాక్సర్   మృతి చెందాడు. కిక్‌బాక్సర్ నిఖిల్ సురేష్..ప్రత్యర్థి పంచ్‌కు తాళలేక తీవ్రంగా గాయపడ్డాడు. ఫేస్ పై పంచ్ గట్టిగా తగలడంతో అతను రింగ్ లోనే కుప్పకూలాడు. టోర్నీ నిర్వాహకులు అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సింగిల్ పంచ్..రింగులో కుప్పకూలిన బాక్సర్...

కిక్ బాక్సర్  నిఖిల్ సురేష్ మైసూరుకు చెందని వ్యక్తి. అతని వయస్సు 23 ఏళ్లు. నిఖిల్  తల్లిదండ్రులు సురేష్, విమల. నిఖిల్ వీరికి చిన్నకుమారుడు. చిన్నప్పటి నుంచే కిక్ బాక్సింగ్ నేర్చుకున్న నిఖిల్..బెంగుళూరులోని కెంగేరీలో జరిగిన రాష్ట్ర స్థాయి K1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా పోటీ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి నిఖిల్ ముఖంపై పంచ్ విసిరాడు. దీంతో ఒక్కసారిగా నిఖిల్ రింగ్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని నాగరభావిలోని హాస్పిటల్ కు తరలించారు. నిఖిల్ చికిత్స పొందుతూ చనిపోయాడు.  నిఖిల్ మృతి చెందడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కిక్ బాక్సర్ గా ఎదగాలని ఆశలతో బెంగుళూరు టోర్నీలో పాల్గొన్నాడని..అయితే తిరిగిరాని లోకాలకు వెళ్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

నిర్వాహకుల నిర్లక్ష్యం..

మరోవైపు బౌట్‌లో నిఖిల్ గాయపడిన సమయంలో అతన్ని ఆసుపత్రి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటు లేదు. కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ నిర్వాహకులు  టోర్నీకి శిక్షణ పొందిన మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ అందుబాటులో ఉంచలేదు. దీంతో నిర్వాహకులపై విమర్శలు చెలరేగుతున్నాయి. మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ అందుబాటులో ఉంటే నిఖిల్ బతికేవాడని కోచ్, తల్లిదండ్రులు చెబుతున్నారు.