నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలో విషాదం

నాగర్​కర్నూల్​ జిల్లా  కోడేరు మండలంలో విషాదం

నాగర్​కర్నూల్​, వెలుగు :  నాగర్‌‌ కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో ఓ భార్య కళ్ల ముందే భర్త వాగులో కొట్టుకుపోయి చనిపోయాడు. కోడేరు మండలంలోని ఖానాపూర్ కు చెందిన ఆది పచ్చర్ల బంగారయ్య(45) శుక్రవారం ఉదయం భార్యతో కలిసి పశుగ్రాసం కోసం వెళ్తున్నాడు. గ్రామ సమీపంలోని వాగు పారుతుండడంతో ముందు బంగారయ్య దాటేందుకు ప్రయత్నించాడు.. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో భార్య కళ్ల ముందే నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. ఇది చూసి షాక్​కు గురైన లక్ష్మి వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పింది. వారు వచ్చి వెతకకగా చనిపోయి చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న బంగారయ్య మృతదేహం కనిపించింది. మృతుడికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా, ఖానాపూర్ వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ, వెంటనే వంతెన కట్టాలని గ్రామస్తులు వాగులో నిలబడి నిరసన తెలిపారు. ఇదిలా ఉండగా, నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నాగనూలు చెరువు అలుగు పొంగడంతో వరద​కాజ్​వేపై నుంచి వెళ్తోంది. శుక్రవారం  బైక్‌పై వస్తున్న యువకుడు దీన్ని దాటేందుకు ప్రయత్నించగా.. బైక్‌ వాగులోకి జారిపోయింది.  స్థానికులు అతడిని కాపాడారు,

గోదావరిలో..  

మహాదేవ్‌‌పూర్‌‌ : భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌పూర్‌‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసుల గాలింపులో ఒకరి శవం దొరికింది. పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌‌ లోని రాంనగర్‌‌కు చెందిన జై దుర్గా భవాని కమిటీకి చెందిన సుమారు 40 మంది అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి కాళేశ్వరం తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం త్రివేణి సంగమం వద్ద నిమజ్జనం చేసి బయటికి వచ్చే క్రమంలో వినోద్ (19) పవన్ (20) ఈత కొడుతూ గోదావరిలో లోతుకు వెళ్లారు. ఇంతలో ప్రవాహ వేగానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. కాళేశ్వరం ఎస్సైలు లక్ష్మణరావు, నరేశ్ గజ ఈతగాళ్లతో వారిని వెతికించారు. శుక్రవారం సాయంత్రం వినోద్ డెడ్​బాడీ దొరకింది. పవన్ మృతదేహం కోసం వెతుకుతున్నారు.