
ముంబై: మహారాష్ట్రలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి 11 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం స్టేట్ ట్రాన్స్పోర్ట్కు చెందిన బస్సు.. కంటైనర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని పోలీసులు తెలిపారు. పాత ముంబై-–నాగ్‌పూర్ హైవేపై సింధ్‌ఖేడ్ రాజా టౌన్దగ్గర్లో ఉదయం ఈ యాక్సిడెంట్జరిగింది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు.. 33 మంది ప్రయాణికులతో పుణె నుంచి మెహకర్ వైపు వెళ్తూ.. పాలస్‌ఖేడ్ చక్కా విలేజ్దగ్గర ట్రక్కును ఢీకొట్టింది. చనిపోయిన వారిలో నలుగురు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని పోలీసులు వెల్లడించారు.
అమరావతిలో పెండ్లికి వెళ్లొస్తుండగా ప్రమాదం
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వేగంగా వచ్చిన ట్రక్కు.. ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అమరావతి జిల్లాలోని ఖల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్యాపూర్–-అంజన్‌గావ్ రోడ్డులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు అంజన్‌గావ్‌లో పెండ్లి వేడుకలో పాల్గొని దర్యాపూర్‌కు తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. యాక్సిడెంట్జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని వారు తెలిపారు. గాయపడిన వారిని దర్యాపూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.