
గూడూరు, వెలుగు: పొలాలను తీసుకున్న కొడుకులు.. తల్లిని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేశారు. దీంతో వృద్ధురాలు రెండు రోజులుగా రోడ్డు పక్కన రేకుల షెడ్డులోనే గడిపింది. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకులతో మాట్లాడి వృద్ధురాలిని వారి వద్దకు పంపించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేటలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వెంగంపేటకు చెందిన ముత్తయ్య, భద్రమ్మకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. వీరందరికీ పెండ్లిళ్లు చేయడంతో పాటు తమకున్న ఐదు ఎకరాల పొలాన్ని అందరికీ పంచి ఇచ్చారు. ముత్తయ్య 20 ఏండ్ల కింద చనిపోగా... అప్పటి నుంచి భద్రమ్మ ఒంటరిగా జీవిస్తోంది. ఐదేండ్ల కింద ఆమె మంచాన పడడంతో నలుగురు కొడుకులు తలా మూడు నెలలు పోషించాలని పెద్దలు తీర్మానించారు.
భద్రమ్మ పెద్ద కొడుకు ఇటీవల చనిపోవడంతో అతడి భార్య కురవి మండలం మంగోరిగూడెంలో ఉంటోంది. రెండు రోజుల కింద మిగతా ముగ్గురు కొడుకుల వాటా అయిపోవడంతో భద్రమ్మను ఆటోలో పెద్ద కోడలు వద్దకు పంపించారు. అయితే ఆమె భద్రమ్మను తాను చూసుకోలేనంటూ అదే ఆటోలో తిప్పి పంపింది. దీంతో ఆటో డ్రైవర్ భద్రమ్మను భూపతిపేట రైతు వేదిక సమీపంలో వదిలేసి వెళ్లి పోయాడు. రెండు రోజులుగా అన్నం, నీళ్లు లేకుండా అక్కడే గడిపింది. గురువారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భద్రమ్మ కొడుకులను పిలిపించి మాట్లాడారు. తర్వాత ఆమెను కుటుంబసభ్యులకు
అప్పగించారు.