
రైల్వే అధికారుల ముందు చూపుతో ‘సీసీటీవీ’ పెద్ద రైలు ప్రమాదాన్ని తప్పించింది. ముంబై–పుణే మార్గంలోని ఘాట్ ట్రాక్‌లో రైల్వే అధికారులు సీసీటీవీ కెమెరాలు అమర్చారు. గురువారం రాత్రి 8.15 గంటలకు లోనావాలాకు సమీపంలో పెద్ద బండరాయి గుట్టపై నుంచి జారి పట్టాలపై పడింది. అది సీసీటీవీల్లో రికార్డ్ కావడం, అధికారులు గమనించడంతో.. అదే టైంలో ఆ దారిలో వెళుతున్న ముంబై–కొల్హాపూర్ సహ్యాద్రి ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కు మళ్లించారు. ఠాకూర్వాడి స్టేషన్లో రెండు గంటలు నిలిపేశారు. ఆ బండరాయిని తీసేశాక రాత్రి 10.30 గంటలకు మళ్లీ రైలుకు పచ్చజెండా ఊపారు. ప్రమాదాన్ని పసిగట్టిన మానిటరింగ్ సిబ్బంది పై అధికారులకు సమాచారమిచ్చారని, వెంటనే పవర్ సప్లైని నిలిపేసి ఆ మార్గంలో వచ్చే రైళ్లన్నింటినీ ఆపేశారని మధ్య రైల్వే ప్రతినిధి సునీల్ ఉడాసీ చెప్పారు.