పూజ కోసం నదిలో నీళ్లకు వెళ్లి తిరిగొస్తుంటే.. 

 పూజ కోసం నదిలో నీళ్లకు వెళ్లి తిరిగొస్తుంటే.. 
  • రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్న యువకులను ఢీకొన్న రైలు..
  • ఇద్దరు యువకుల మృతి

కర్నూలు: గ్రామంలో గంగమ్మ జాతర కోసం పవిత్ర తుంగభద్ర నది నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన యువకులు తిరిగి వస్తున్న సమయంలో రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తుండగా చీకట్లో వెనుకవైపు నుంచి వచ్చిన రైలు ఢీకొట్టింది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు యువకులు ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలోని కోసిగి మండలం ఐరనగల్ సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందీ ఘటన. మృతులు బోయ ఆంజనేయులు(16), శ్రీనివాసులు (16)  ఆస్పరి మండలం బిణిగేరి గ్రామ వాసులుగా గుర్తించారు. 
ఆస్పరి మండలం బెణిగేరి గ్రామంలో గ్రామస్తులు గంగమ్మ పూజ తలపెట్టారు. తమ గ్రామ సంప్రదాయంలో భాగంగా జరిగే ఉత్సవానికి మంత్రాలయం సమీపంలోని పవిత్ర తుంగభద్ర నదిలో నుండి నీళ్లు తెచ్చేందుకు 300 మంది యువకులు శనివారం బయలుదేరి వెళ్లారు. మంత్రాలయం దగ్గర తుంగభద్ర నది జలాలు తీసుకున్న యువకులు కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. అందరితోపాటు స్వగ్రామానికి బయలుదేరిన ఆంజనేయులు, శ్రీనివాసులు కోసిగి మండలం ఐరన్ గల్లు సమీపంలో రాత్రిపూట చీకట్లో రైలు పట్టాలపై నడుచుకుంటూ వస్తున్నారు. వెనుకవైపు నుంచి రైలు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇద్దరూ తీవ్ర రక్తగాయాలతో చనిపోయారు. పవిత్ర పూజ కోసం నది జలాలకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు చనిపోవడం గ్రామంలో విషాదం రేపింది.