టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ...

టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ...

మెదక్/మెదక్​టౌన్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా రూ.100 కోట్లు ఇస్తే మెదక్ కు రైల్వేలైన్​ పూర్తయి రైలు వచ్చిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డితో కలిసి మెదక్​లో రైల్వే రేక్​పాయింట్​ను ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. 2004లో తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని, 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైల్వేలైన్ కాలేదన్నారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అవసరమైన నిధులు కేటాయించి రైల్వేలైన్​ పూర్తి చేయించిందన్నారు. మంత్రి నిరంజన్​ రెడ్డి మాట్లాడుతూ రైల్వే రేక్​ పాయింట్​ రావడంతో పీడీఎస్​ రైస్​తో పాటు, ఎరువులు, విత్తనాల రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రైల్వే లైన్ తో మెదక్​ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్​ రెడ్డి, ఫారుఖ్​ హుసేన్​, యాదవరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్​ సాయిచంద్, జడ్పీ చైర్​ పర్సన్​ హేమలత, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్​ దేవేదర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్​రావు, కలెక్టర్​ హరీశ్, అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు. అనంతరం మెదక్​ పట్టణంలో ఫైర్​స్టేషన్​ వద్ద రూ.2.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ భవన సముదాయానికి మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన చేశారు. 

‘డబుల్’ ఇండ్ల ప్రారంభం 

దుబ్బాక, వెలుగు: దౌల్తాబాద్​ మండలం దొమ్మాటలో నిర్మించిన డబుల్​ బెడ్ ​రూమ్​ ఇండ్లను సోమవారం ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్​రావుతో కలిసి మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని శివాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. 

తల్లి పాలు బిడ్డకు ఫస్ట్​ టీకాతో సమానం

గజ్వేల్, వెలుగు : పుట్టిన మొదటి గంటలో తల్లి పాలు బిడ్డకు ఫస్ట్​ టీకాతో సమానమని, ఇది రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను జీవితాంతం ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. సోమవారం గజ్వేల్​ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని తల్లిపాల సొసైటీ, గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ మేధా, కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌, భవాని పాలి క్లినిక్ సంయుక్తంగా నిర్వహించాయి.  ఈ సందర్భంగా 500 మంది చంటిపిల్లల తల్లులు పాల్గొనటం బుక్ ఆఫ్ ఇండియాలో రికార్డుగా నమోదయినట్టు నిర్వాహకులు తెలిపారు.  

ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ వేయించాలి

సిద్దిపేట, వెలుగు :  ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల్లో  18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయించేలా చొరవ తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.  సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సిద్దిపేట నియోజక వర్గ మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ కౌన్సిలర్ల తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నారు. కంటి వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.  సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను  ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. మలేరియా, డెంగీ రాకుండా  ప్రజలను కాపాడుకునే విధంగా ఫ్రైడే డ్రైడే, ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు ఎవరి ఇంటిని వారు శుభ్రం చేసుకునే కార్యక్రమాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.