గజ్వేల్​కు రైలు బండి

గజ్వేల్​కు రైలు బండి

ఒకట్రెండు వారాల్లో ప్రయాణం షురూ
ఫాస్ట్​ ట్రయల్​ రన్ కు అన్నీ రెడీ

గజ్వేల్, వెలుగు: గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్​.. ఈ ప్రాంతాల వారికి రైలు బండెక్కడం ఎన్నో ఏండ్ల కల.. దీనిని సాకారం చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్రం కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో అప్పటివరకు కాగితాలకే పరిమితమైన ప్రతిపాదన పట్టాలెక్కింది. నిజామాబాద్​ రైల్వే లైన్​లో వచ్చే మెదక్​ జిల్లా మనోహరాబాద్​ నుంచి గజ్వేల్, సిద్దిపేటను కలుపుతూ కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి వరకు ఈ కొత్త మార్గాన్ని నిర్మించ తలపెట్టారు. మొత్తం 151 కి.మీ. ఉన్న ఈ లైను పనుల అంచనా వ్యయం రూ.1160.47 కోట్లు. పనులను మొత్తం నాలుగు దశలుగా చేపట్టడానికి నిర్ణయించారు. ఇందులో మొదటి దశలో మనోహరాబాద్​–గజ్వేల్​ మధ్యన 31 కి.మీ. మేర రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. తర్వాత దశలో 33 కి.మీ. మేర గజ్వేల్​-దుద్దెడ, 48 కి.మీ. దుద్దెడ -సిరిసిల్ల, 38 కి.మీ. సిరిసిల్ల -కొత్తపల్లి మార్గాలను సిద్ధం చేస్తారు.

ఎల్లుండి సేఫ్టీ ఇన్స్​పెక్షన్​
మొదటి దశలో మనోహరాబాద్​-గజ్వేల్​ మార్గాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. మనోహరాబాద్​ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఫ్లైఓవర్, నాచారం గుట్ట వద్ద హల్దీవాగుపై భారీ వంతెన నిర్మించారు. దీనితో పాటు పలుచోట్ల 59 వంతెనలు నిర్మించారు. నాచారం, గజ్వేల్​లో రైల్వే స్టేషన్లను ఏర్పాట్లు చేశారు. రైలు లైను పూర్తయ్యాక దానిపై ప్యాసింజర్​ రైలును నడపాలంటే రైల్వేశాఖ ఇన్స్​పెక్షన్​ చేయాల్సి ఉంటుంది. శుక్రవారం ఇన్స్​పెక్షన్​ నిర్వహించటానికి అధికారులు నిర్ణయించారు. ఆ రోజు సేఫ్టీ ఇన్స్​పెక్షన్​ కమిషనర్​ సమక్షంలో రైలును అత్యంత వేగంగా నడిపి చూస్తారు. అన్నీ బాగుంటే ఫైనల్​ రన్​కు అనుమతి ఇస్తారు. సాధారణంగా మనోహరాబాద్​-గజ్వేల్​ లైన్​లో రైలు సాధారణ స్పీడ్​గంటకు
100 కి.మీ.గా ఉంటుంది. ఇన్స్​పెక్షన్​ సమయంలో 100 నుంచి 140 కి.మీ. స్పీడ్​తో రైలును నడిపి చూసి.. లోపాలుంటే సరిచేస్తారు. మొదటి దశలో డీజిల్​ ఇంజిన్​తో నడుపుతారు. మొత్తం కరీంనగర్​(కొత్తపల్లి) వరకు మార్గం పూర్తయితే దీనిని విద్యుదీకరిస్తారు.

For More News..

ఆకలి తీర్చిన గో ‘మాత’

కేటీఆర్ మోసం చేశాడని ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ