
శేఖర్ కమ్ముల సినిమా థియేటర్లలో సందడి చేసి మూడున్నరేళ్లు దాటిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఒక సరికొత్త కథాంశంతో ‘కుబేర’ సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున, ధనుష్, రష్మిక మందన నటించిన ‘కుబేర’ సినిమా టీజర్ వచ్చేసింది. #TranceOfKuberaa పేరుతో విడుదలైన ‘కుబేర’ సినిమా టీజర్ అంచనాలను మరింత పెంచేలా ఉంది. ‘‘నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా’’ అని టీజర్ మొదలైంది. 2 నిమిషాల 7 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోతో దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ కథను చూచాయగా వివరించే ప్రయత్నం చేశాడు. రెగ్యులర్ టీజర్లా కాకుండా టీజర్ ఆసాంతం పాటతో సాగడం విశేషం.
‘పుష్ప2’తో అదరగొట్టిన దేవీశ్రీప్రసాద్ ‘కుబేర’ టీజర్కు పూనకాలు తెప్పించే స్థాయిలో బీజీఎం ఇచ్చాడు. ఈ టీజర్ మొత్తానికి లిరిక్స్, నాగార్జున, ధనుష్ సన్నివేశాలు ఒక ఎత్తయితే.. డీఎస్పీ అందించిన బీజీఎం ‘కుబేర’ టీజర్ను మళ్లీమళ్లీ చూసేంత ఆసక్తి ప్రేక్షకుల్లో రేకెత్తించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘కుబేర’ టీజర్ చూసిన తర్వాత డీఎస్పీ బీజీఎం గురించి నూటికి 90 శాతం మంది మాట్లాడుకుంటారు. టీజర్లో చివరి సన్నివేశం మాత్రం ‘కుబేర’ కథపై మరింత ఆసక్తిని పెంచింది. నాగార్జునపై దాడి చేసేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్న సన్నివేశం అది.
ALSO READ | OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే !
జూన్ 20న ‘కుబేర’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా గురించి అనౌన్స్ చేసిన సందర్భంలో ‘కుబేర’ మూవీ టీం విడుదల చేసిన ధనుష్ లుక్తోనే ఈ సినిమా రొటీన్ స్టోరీ కాదని తేలిపోయింది. World of Kubera పేరుతో శేఖర్ కమ్ముల విడుదల చేసిన ధనుష్ లుక్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్. శివుడు భిక్షాటన చేస్తున్న విజువల్ బ్యాక్ గ్రౌండ్లో ఉండగా.. మాసిపోయిన గడ్డంతో ధనుష్ అమాయకంగా నిల్చుని కనిపించిన లుక్ ఈ సినిమా గురించి ఇండస్ట్రీ చర్చించుకునేలా చేసింది. ఇప్పుడు టీజర్తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ చూసిన ప్రేక్షకులు హిట్ బొమ్మ అని డిసైడ్ అయిపోయారు. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో.. లేదో తెలియాలంటే జూన్ 20వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. జూన్ 2021లో ‘కుబేర’ సినిమా చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల ప్రకటించాడు. ఇన్నాళ్లకు ఈ ‘కుబేర’కు మోక్షం లభించింది.