ఆదాయ వనరుల తరలింపు

ఆదాయ వనరుల తరలింపు

సాధారణంగా అభివృద్ది చెందిన ప్రాంతాల మిగులువృద్ధి నిధులను వెనుకబడ్డ ప్రాంతాల అభికి ఖర్చు చేయాలి. కాని వెనుకబడ్డ ప్రాంత (తెలంగాణ) నిధులను అభివృద్ధి చెందిన ప్రాంతాలకు మళ్లించడం ఇంత వరకు ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. తెలంగాణ మిగులు నిధులను ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున వ్యయం చేశారు. తద్వారా తెలంగాణలో అభివృద్ధి బాగా తగ్గిపోయింది. ఈ విధమైన ఆర్థిక ఉల్లంఘనతో కాక భూములు, ఉద్యోగాలు, విద్యా సంస్థల సీట్లు, ప్రమోషన్లు, సాంస్కృతిక అవహేళనలు మొదలైన వాటిలో అన్యాయాలు, అక్రమాలు, ఉల్లంఘనలు, వేధింపులు, చీత్కారాలు జరగడంతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు  ఉద్యమ బాట పట్టారు. 

నిజాం కాలంలో తెలంగాణలో తలసరి భూమి శిస్తు ఆదాయం రూ.3.42. ఇదే కాలంలో ఆంధ్రప్రాంతంలో తలసరి భూమి శిస్తు ఆదాయం రూ.1.82. ఆంధ్ర రాష్ట్ర వార్షిక ఆదాయం రూ.22కోట్లు ఉండగా, 2.05 కోట్ల జనాభాతో తలసరి వార్షిక ఆదాయం రూ.10.53కోట్లుగా తేలింది. 

పెద్ద మనుషుల ఒప్పందం (1956)

విశాలాంధ్ర ఏర్పాటులో తెలంగాణ ప్రజల భయాలు పోగొట్టడానికి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు రక్షణలు కల్పించడానికి కేంద్ర హోంమంత్రి గోవింద్​ వల్లభ్​ పంత్​ సమక్షంలో ఢిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో 1956, ఫిబ్రవరి 20న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు ప్రభుత్వాల్లోని కాంగ్రెస్​ అత్యున్నత స్థాయి నాయకుల సమాన సంఖ్యలో ప్రతినిధులుగా హాజరై తెలంగాణ ప్రాంతానికి రక్షణ కల్పించే 14 అంశాలపై ఏకాభిప్రాయం సాధించి వాటిపై సంతకాలు చేశారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల కలయికగా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరగదనే ఒప్పందం మేరకు ఏర్పడింది. ఈ హామీలతో కూడిన ప్రప్రథమ ఒప్పందాన్ని పెద్ద మనుషుల ఒప్పందం అంటారు. 

ఒప్పందంలోని ఆర్థికాంశాలు

పెద్ద మనుషుల ఒప్పందం మేరకు రాష్ట్ర సాధారణ పాలన, ఉమ్మడి రాష్ట్రస్థాయి కార్యాలయాలపై అయ్యే ఖర్చును ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు 2:1 నిష్పత్తిలో భరించాలి. 

తెలంగాణ మిగులు నిధులు/ ఆదాయాలను తెలంగాణ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని ఒప్పందంలో ఒక కీలకమైన అంశం. 

అఖిలపక్ష ఒప్పందం: 1969 జనవరి 18, 19 తేదీల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి నివాసమైన ఆనంద నిలయంలో అన్ని రాజకీయ పక్షాల నాయకత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. జనవరి 19న జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రాంత రక్షణకు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ అంగీకారాన్ని అఖిలపక్ష ఒప్పందం అంటారు. అఖిలపక్ష ఒప్పందం ప్రకారం ఆంధ్రా ప్రాంతానికి తరలించిన తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీసి ఆ నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్దికి ఉపయోగించాలి.

అష్టసూత్ర పథకం: ప్రధాని ఇందిరాగాంధీ 1969, ఏప్రిల్​ 11 నాడు పార్లమెంట్​లో అష్టసూత్ర పథకం అనే తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారానికి పథకం ప్రకటించారు. దీని ప్రకారం తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తీయడానికి ఒక ఉన్నతాధికారి సంఘాన్ని నియమించారు. ఈ కమిటీకి నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.  

తెలంగాణ బడ్జెటరీ మిగులు

రెవెన్యూ, మూలధన (క్యాపిటల్​) పద్దుల కింద తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన మొత్తానికి, వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తానికి మధ్య ఉన్న తేడాను బడ్జెటరీ మిగులు అంటారు. తెలంగాణ బడ్జెటరీ మిగులును అంచనా వేయడానికి రెండు కమిటీలను నియమించారు. 
కుమార్​ లలిత్​ కమిటీ (1956–68): అఖిలపక్షం ఒప్పందంలో భాగంగా తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి భారత కంట్రోలర్, ఆడిటర్​ జనరల్​ సూచనల మేరకు కుమార్​ లలిత్​ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని 1969 జనవరి 23న ఏర్పాటు చేశారు. 1956 నవంబర్​ నుంచి 1968 
 వరకు మిగులు నిధులను లెక్కించారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు నిధులు 

రూ.34.10కోట్లు. 

తెలంగాణ నికర మిగులు: లలిత్​ కమిటీ తెలంగాణలో మిగులు లెక్కింపునకు ఏర్పాటైంది. మిగులు అనేది ఆంధ్రప్రాంత ఆదాయం కంటే అదనంగా ఆంధ్రలో చేసిన వ్యయాన్ని తెలంగాణ మిగులుగా నిర్వచించారు. రాష్ట్రాల జనాభా ప్రాతిపదికగా ఆంధ్ర 66.7శాతం, తెలంగాణ 33.3శాతంగా నిర్ణయించారు. అయితే 1961 జనాభా ప్రకారం తెలంగాణ ప్రాంతం 35.3శాతంగా, ఆంధ్ర ప్రాంతం 64.7 శాతం వాటా కలిగి ఉంది. ముఖ్యంగా 33.3శాతం ద్వారా అంచనా వేయడం ద్వారా ఆదాయాల్లో తగ్గుదల ఉంటుంది. కాబట్టి 35.3శాతం ప్రస్తుత జనాభా ప్రకారం తెలంగాణ మిగులును లెక్కించింది. తెలంగాణ రెవెన్యూ మిగులు (1956–68) 12 సంవత్సరాల మొత్తం సుమారు 63.9కోట్ల రూపాయలు, ఇదే కాలానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఖాతా మిగులు 10.4కోట్లుగా ఉంది. అయితే తెలంగాణలో పెట్టుబడి ఖాతా కింద రూ.3.7కోట్ల వ్యయం చేశారు. దీన్ని తీసివేయగా రూ.60.2కోట్లు తెలంగాణలో నికర మిగులుగా ఉన్నట్లు లలిత్​ కమిటీ నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్​ ఏర్పడే నాటికి హైదరాబాద్​ నుంచి తెలంగాణకు బదిలీ అయిన రూ.14కోట్ల సెక్యూరిటీలు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వద్ద ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా తెలంగాణకు మాత్రమే  ఉపయోగించాల్సినవి. 

వశిష్ట భార్గవ కమిటీ (1969)

మిగులు నిధులను గణించడంలో కుమార్​ లలిత్​  కమిటీ పొరపాట్లు చేసిందని విలీనం నాటికే తెలంగాణ దగ్గర ఉన్న మిగులు నిధులతో సహా అన్ని ఖాతాలను పరిశీలిస్తే మొత్తం మిగులు నిధులు రూ.107.13కోట్లు  అవుతుందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆరోపించింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తానని అష్టసూత్ర పథకంలో భాగంగా భార్గవ కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక సమర్పించడానికి తుది గడువు 1969, మే 31. కానీ ఈ కమిటీని 1969 అక్టోబర్​ 31 వరకు పొడిగించారు. 

తెలంగాణ మిగులు నిర్ధారణ: భార్గవ కమిటీ ప్రభుత్వానికి 123 పేజీల నివేదిక సమర్పించింది. కానీ ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేయలేదు. ఈ కమిటీ తెలంగాణలో సుమారు 28.34 కోట్ల రూపాయల మిగులు నిధులు ఉన్నాయి అని నిర్ధారించింది. అయితే తెలంగాణలో మిగులు నిధులు నిర్ధారణకు నియమించిన లలిత్​ కమిటీ 34.09కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ రెండు కమిటీలూ మిగులు నిధులు కొద్ది తేడాతో దాదాపు సమానంగా ఉన్నట్లు తెలుస్తుంది.

కమిటీ నివేదికలు 

ఎస్​కే థార్​ కమిషన్​ : 1945–48 మధ్య మద్రాస్​ ప్రావిన్స్​లోని ఆంధ్ర జిల్లాల వార్షిక ఆదాయం రూ.12.07కోట్లు. ఈ జిల్లాల జనాభా 1.88 కోట్లుగా ఉంది. వీరి తలసరి వార్షిక ఆదాయం రూ.6.46గా ఉంది. వార్షిక వ్యయం 18.58కోట్లు ఉండగా, దాదాపు రూ.6.52కోట్ల లోటు ఉందని తెలుస్తుంది. 
రాష్ట్రాల పునర్విభజన కమిషన్​ (1955): హైదరాబాద్​ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల వార్షిక ఆదాయం రూ.17కోట్లు. జనాభా 1.13కోట్లు. తలసరి వార్షిక ఆదాయం రూ.15.04గా ఉంది. 
శివరావు(1967): ఉమ్మడి హైదరాబాద్​ రాష్ట్రంలో వార్షిక ఆదాయం రూ.20.86కోట్లు. జనాభా 1.63కోట్లు ఉండగా, తలసరి వార్షిక ఆదాయం రూ.12.80గా ఉంది. 
రాఘవయ్యంగార్​: 1888 నాటికి నిజాం ఆధీనంలోని తెలంగాణలో ఆదాయం, బ్రిటిష్​ ఆధీనంలోని ఆంధ్ర ప్రాంతం కంటే 88శాతం ఎక్కువగా ఉంది.  
చారిత్రకంగా తెలంగాణ ప్రాంతం కంటే అధిక వార్షిక తలసరి రెవెన్యూ కలిగి ఉందని పై  అర్థమవుతుంది. ఏపీ ఏర్పడే నాటికి ఆంధ్ర రాష్ట్రం లోటు బడ్జెట్​లో ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్​లో ఉందనేది మరిచిపోలేని వాస్తవం.