వాహన పోర్టల్ లో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసుకోండి:రవాణ శాఖ

వాహన పోర్టల్ లో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసుకోండి:రవాణ శాఖ
  • వాహన్ పోర్టల్‌‌‌‌లో మొబైల్ నంబర్లను అప్‌‌డేట్‌‌ చేసుకోండి
  • 31లోపు అప్‌డేట్‌ చేసుకోకపోతే 
  • పాత ఫోన్ నంబర్లకే చలాన్ల మెసేజ్‌లు 
  • 45 రోజుల్లో చలాన్లు కట్టకపోతే పోర్టల్‌ సేవలు నిలిపివేస్తామన్న రవాణా శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని రకాల వాహనదారులు ‘వాహన్’ పోర్టల్‌కు తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా అప్‌డేట్ చేసుకోకపోతే అప్పటికే వాహన్ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్లకే చలాన్ల సమాచారం వెళ్తుందని వెల్లడించింది. దీంతో వాహనదారునికి ఆ సమాచారం చేరినట్లే తాము భావించాల్సి ఉంటుందని ఆ జీవోలో స్పష్టం చేసింది. చలాన్లను జారీ చేసిన 45 రోజుల్లో దానికి సంబంధించిన ఫైన్‌లను చెల్లించాలని, లేకపోతే ఆ వాహనదారునికి ‘వాహన్’ పోర్టల్ సేవలు నిలిచిపోనున్నాయని అందులో పేర్కొంది.

దీంతో రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అందులోని అడ్రస్ మార్పు, వాహన రిజిస్ట్రేషన్, బదిలీ వంటి వాటి విషయంలో సమస్యలు ఏర్పడనున్నాయని తెలిపింది. అలాగే, జులై 1 నుంచి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వాటికి సంబంధించిన చలాన్ల సమాచారం ఎస్ఎంఎస్‌తో పాటు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా కూడా చేరనుందని అందులో పేర్కొంది.