ఆర్టీసీకి 275 కొత్త బస్సులు..మహాలక్ష్మి స్కీమ్​ రద్దీని తగ్గించడానికి కొనుగోలు : మంత్రి పొన్నం

ఆర్టీసీకి 275 కొత్త బస్సులు..మహాలక్ష్మి స్కీమ్​ రద్దీని తగ్గించడానికి కొనుగోలు : మంత్రి పొన్నం
  • కారుణ్య నియామకాల్లో కండక్టర్​పోస్టుల రిక్రూట్​కు మంత్రి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : మహాలక్ష్మి పథకం ద్వారా పెరుగుతున్న రద్దీని తగ్గించడానికి మరో 275 బస్సులు కొనుగోలుకు చేయాలని  ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.  గత నెలలో 80 బస్సులు ప్రారంభించి పబ్లిక్ కు అందుబాటు లో ఉంచగా.. వచ్చే జులై వరకు మరో వెయ్యి కొత్త బస్సులు రానున్నాయని, ఈ వెయ్యి బస్సులకు 275 అదనం అని బుధవారం మంత్రి పొన్నం ఓ ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి వరకు 9 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారని ఆయన ప్రకటించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం అమలు చేశామని,  ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తుందని ఆయన చెప్పారు. బస్సులో ప్రయాణం చేసే  ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని పొన్నం తెలిపారు. 

కారుణ్య నియామకాలకు మంత్రి గ్రీన్ సిగ్నల్

కారుణ్య నియామకాల్లో భాగంగా కండక్టర్లను రిక్రూట్ చేసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. మొత్తం 813 మందిని నియమించాలని సూచించారు. హైద‌‌రాబాద్ రీజియన్​లో 66 పోస్టులు, సికింద్రాబాద్​లో 126, రంగారెడ్డిలో 52, న‌‌ల్గొండలో 56, మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్ లో 83, మెద‌‌క్​లో 93, వ‌‌రంగ‌‌ల్ లో 99, ఖ‌‌మ్మంలో 53, ఆదిలాబాద్​లో 71, నిజామాబాద్​లో 69, క‌‌రీంన‌‌గ‌‌ర్ రీజియన్​లో 45 కండ‌‌క్టర్ పోస్టుల‌‌ను ఆర్టీసీ  భ‌‌ర్తీ చేయ‌‌నుంది. ఈ నిర్ణయంతో ఏండ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు న్యాయం జరుగుతుందని,  తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం వెల్లడించారు.

రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలె : యూనియన్ నేతలు

ఆర్టీసీలో కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. కేసీఆర్ పాలనలో రెగ్యులర్ ప్రాతిపాదికన ఇవ్వాల్సిన ఉద్యోగాలను కంసాలిడేట్ పేమెంట్ పైన ఇచ్చి కార్మికులకు అన్యాయం చేశారని  ఎస్​డబ్ల్యూఎఫ్ (ఐఎన్ టీయూసీ) జీఎస్ రాజిరెడ్డి, ఎన్ ఎంయూ  నేత కమాల్ రెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ ( సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావు, టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హన్మంతు ముదిరాజ్ ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు సర్వీసులో 1,100 మంది కార్మికులు చనిపోయారని, తమ కుటుంబంలో ఒకరికి జాబ్ వస్తుందని ఆశగా ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయని నేతలు గుర్తు చేశారు.