విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్

విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్
  •  నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కోమటిరెడ్డి
  • సీఎస్ఆర్​లో భాగంగా నిర్మించి సర్కారుకు ఇవ్వనున్న ఏడీపీ కంపెనీ
  • యాక్సిడెంట్ బాధితులకు ఉపయోగపడనున్న సెంటర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్– విజయవాడ నేషనల్  హైవేపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్  గ్రామం దగ్గర ట్రామా కేర్  సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ సెంటర్  నిర్మాణానికి ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారంశంకుస్థాపన చేయనున్నారు. కార్పొరేట్  సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) లో భాగంగా ఏడీపీ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ 3 ఫ్లోర్లలో 6,500 చదరపు అడుగులో ఈ ట్రామా కేర్ సెంటర్ ను నిర్మించి ప్రభుత్వానికి అందజేయనుంది. 

 సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వినతి మేరకు కంపెనీ ఈ సెంటర్  నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దేశంలో ఉన్న నేషనల్ హైవేస్ లో ఎక్కువ రద్దీతో పాటు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న హైవేగా ఈ రూట్ ఉంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళుతుండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించే టైమ్ లో మృతి చెందడం, పరిస్థితి సీరియస్  అవుతుండడంతో ఏటా వేల మంది మరణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందించేందుకు ఈ ట్రామా కేర్ సెంటర్ లో అంబులెన్సులు, బెడ్లు, డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటారు. వెంటనే ట్రీట్ మెంట్ అందిస్తే ఎన్నో ప్రాణాలు కాపాడొచ్చని అధికారులు అంటున్నారు.