
- జగిత్యాలలో నత్తనడకన సాగుతున్న భవన నిర్మాణం
- సర్కార్ ఆస్పత్రుల్లో అందని ఎమర్జెన్సీ సర్వీసులు
- గాలిలో కలుస్తున్న పేదల ప్రాణాలు
- ఇటీవల జగిత్యాల పర్యటనలో ఆరోగ్య శాఖ మంత్రి హామీతో చిగురిస్తున్న ఆశలు
కరీంనగర్/జగిత్యాల, వెలుగు: ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో గోల్డెన్ అవర్(మొదటి గంట)లోగా వైద్యం అందించేందుకు ఉపయోగపడే ట్రామా కేర్ సేవలు ఉమ్మడి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇప్పటివరకు అందబాటులోకి లేవు. ఫలితంగా యాక్సిడెంట్ జరిగితే క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులకో లేదంటే హైదరాబాద్, వరంగల్ నగరాలకో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆవరణలో ఇటీవల క్రిటికల్ కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం పూర్తయినా ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. రెండేళ్ల కింద జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ క్రిటికల్ కేర్ మంజూరైనప్పటికీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్‌కే..
యాక్సిడెంట్ లాంటి ఘటనల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటళ్లకు తీసుకెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రాణాపాయ పరిస్థితి ఉంటే ప్రైవేట్ ఆస్పత్రులకే తరలిస్తున్నారు. కనీసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలోనైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తే పేదల ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇన్నాళ్లుగా ట్రామా కేర్ సేవలు అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మెడికల్ కాలేజీ మంజూరయ్యాక జిల్లా హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్‌గా అప్ గ్రేడ్ అయింది.
అన్ని రకాల వైద్య విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఇప్పటివరకు ట్రామాకేర్ సేవలు అందడం లేదు. జిల్లా హాస్పిటల్‌లో 50 బెడ్స్ తో నిర్మించిన క్రిటికల్ కేర్ సెంటర్‌లోనే ట్రామా కేర్ సెంటర్ కు కావాల్సిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆర్థో, న్యూరో, కార్డియాలజీ, పల్మనాలజీ తదితర విభాగాల వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు మొదలు కాలేదు.
జగిత్యాలలో నిర్మాణంలో ట్రామా కేర్
కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు మూడు ప్రధాన రహదారుల కూడలిలో జగిత్యాల జిల్లా కేంద్రం ఉంది. దీంతో ఈ రూట్లలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో ఏ ప్రమాదం జరిగినా జగిత్యాలకే తీసుకొస్తారు. అయితే జగిత్యాల జిల్లా హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ సెంటర్ లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్‌కే పంపించాల్సి వస్తోంది. జిల్లా హాస్పిటల్‌లో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణం రెండేళ్లుగా స్లోగా నడుస్తోంది. అవసరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్ ఇంకా రాలేదు. ఈ భవన నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా సుమారు రూ. 40 కోట్లు అవసరం ఉంది.
హామీ ఇచ్చిన మంత్రి
ఇటీవల జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజానర్సింహా దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. మిగతా నిధులు మంజూరు చేసి త్వరగా క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడంతో పనులు ఊపందుకోనున్నాయి. అంతేగాక జిల్లాకు అనుబంధంగా ఉన్న మూడు రూట్లలో 35 కిలోమీటర్ల వ్యవధిలో మూడు క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో ప్రజలకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుబాటులోకి రానుండడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల ‘ట్రామా’ బిల్డింగ్‌లో కొన్ని లోపాలున్నాయి
జగిత్యాల ట్రామా కేర్ సెంటర్ బిల్డింగ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. బిల్డింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సెట్ చేస్తున్నారు. మెడికల్ ఎక్విప్‌మెంట్ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాం. వాటి టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. 2 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తాం.
డాక్టర్ సుమన్ రావు, జగిత్యాల హాస్పిటల్ సూపరింటెండెంట్