వాట్సప్ వీడియో కాల్​తో ట్రీట్​మెంట్.. కడుపులోనే కవల పిల్లలు మృతి

వాట్సప్ వీడియో కాల్​తో ట్రీట్​మెంట్..  కడుపులోనే కవల పిల్లలు మృతి
  • 5 నెలలకే నొప్పులతో హాస్పిటల్​కు గర్భిణి
  • అందుబాటులో లేని డాక్టర్.. ఫోన్​లో నర్సులతోనే వైద్యం
  • ఆగ్రహించిన కుటుంబ సభ్యులు
  • న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు ధర్నా
  • దవాఖానాను సీజ్ చేసిన డీఎంహెచ్​వో
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నది. వాట్సప్ వీడియో కాల్ ద్వారా డాక్టర్ సూచనల మేరకు నర్సులు ఓ మహిళకు ట్రీట్​మెంట్ చేశారు. దీంతో ఇద్దరు కవలలు చనిపోయారు. ఆగ్రహించిన బంధువులు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి హాస్పిటల్​లో ఈ ఘటన చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి గణేశ్ ముదిరాజ్, కీర్తికి ఏడేండ్ల కింద పెండ్లి అయింది. పిల్లలు పుట్టకపోవడంతో హైదరాబాద్ సిటీలోని ఒక దవాఖానాలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కీర్తి గర్బం దాల్చింది. 3 నెలలుగా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్డులో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ లో డాక్టర్ అనూషా రెడ్డి వద్ద చెకప్ చేయించుకుంటున్నది. 

20 రోజుల కింద ట్రీట్​మెంట్ కోసం కీర్తి హాస్పిటల్​కు వచ్చింది. స్కానింగ్ చేసిన డాక్టర్.. కడుపులో కవలలు ఉన్నారని, ఎలాంటి పనులూ చేయొద్దని సలహా ఇచ్చింది. కడుపు దగ్గర కొన్ని కుట్లు వేసి పంపించేసింది.  5 నెలల గర్భిణి అయిన కీర్తికి ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషా రెడ్డికి ఫోన్ చేశారు. ఓ ఇంజక్షన్ పేరు చెప్పి వెంటనే వేయించాలని సూచించింది. అయినప్పటికీ నొప్పులు తగ్గకపోవడంతో కీర్తిని కుటుంబ సభ్యులు విజయలక్ష్మి హాస్పిటల్​కు తీసుకెళ్లారు. నొప్పులు తగ్గేందుకు ఇంజక్షన్ చేయాలని నర్సులకు డాక్టర్ సూచించింది. 

ఇంజక్షన్ చేసినా నొప్పులు తగ్గలేదు. నర్సులతో ఆమె వాట్సప్ వీడియో కాల్ లో మాట్లాడుతూ వైద్యం అందించింది. ఉదయం 10‌‌‌‌.30 గంటలైనా డాక్టర్ హాస్పిటల్​కు రాలేదు. వీడియో కాల్​లో మాట్లాడుతూ.. నర్సులతోనే ట్రీట్​మెంట్ చేయించింది. చివరికి ఇద్దరు మృత శిశువులు బయటికి వచ్చారు. 11 గంటలకు హాస్పిటల్​కు వచ్చిన డాక్టర్ అనూషా రెడ్డి.. కవలలు చనిపోయారని, తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పింది. ఆ కవలలను ఆదివారమే కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జి చేసే టైమ్​లో రూ.30వేలు కట్టాలని డాక్టర్ అనూషా రెడ్డి చెప్పింది. 

దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు డాక్టర్​తో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్​కు సుమారు రూ.5 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగానే కవలలు చనిపోయారని ఫైర్ అయ్యారు. కవలలు చనిపోయేందుకు డాక్టర్ అనూషా రెడ్డినే కారణమంటూ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు.

తల్లి ప్రాణాలు కాపాడినం: డాక్టర్ అనూషా రెడ్డి

4 నెలల గర్భిణికి నొప్పులు రావడంతో హాస్పిటల్​క వచ్చిందని డాక్టర్ అనూషా రెడ్డి మీడియాకు తెలిపారు. తీవ్ర రక్త స్రావం అవుతున్నదని సిస్టర్స్ చెప్పడంతో వెంటనే ట్రీట్​మెంట్ స్టార్ట్ చేశామన్నారు. వైద్యం అందించకపోయి ఉంటే తల్లి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగేదని వివరించారు. తాను వచ్చి తల్లిని కాపాడేందుకు వైద్య సహాయం అందించానని వివరించారు. ట్రీట్​మెంట్ పరంగా  నిర్లక్ష్యంగా వ్యవహరించలేదన్నారు. 

బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం: డీఎంహెచ్​వో

విజయలక్ష్మి హాస్పిటల్​ను రంగారెడ్డి డీఎంహెచ్​వో వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. ప్రాథమికంగా విచారణ జరిపిన ఆయన.. హాస్పిటల్​ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రీట్​మెంట్ తీసుకుంటున్న రోగులను వనస్థలీపురం ఏరియా హాస్పిటల్​కు తరలిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.