
- కరీంనగర్ జిల్లాలో పంపిణీకి నోచుకోని 1,227 ఇండ్లు
- అయిదారేండ్లుగా నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థలోకి
- రిపేర్లు చేస్తేనే వినియోగంలోకి
- కరీంనగర్ సిటీలో సొంత స్థలం, ఇల్లు లేని పేదకుటుంబాలు 25 వేల మందికిపైగానే
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూం ఇండ్లు, అపార్ట్ మెంట్లలో చెట్లు మొలుస్తున్నాయి. అయిదారేళ్లుగా ఈ ఇళ్లు నిరుపయోగంగా ఉండడంతో క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అటువైపుగా ఎవరూ వెళ్లకపోవడంతో మందుబాబులకు, క్షుద్రపూజలకు, ఇతర అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఉండడానికి ఇల్లు, జాగా లేని నిరుపేద కుటుంబాలు జిల్లావ్యాప్తంగా వేలాదిగా ఉన్నప్పటికీ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం.. ఇల్లు కట్టుకునేందుకు కనీసం జాగ లేని నిరుపేదలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పంపిణీ సంగతి ఎలా ఉన్నా ముందు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లకు రిపేర్లు చేయాలని, పెండింగ్ పనులు పూర్తి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జిల్లాలో పంపిణీకి నోచుకోని 1,227 ఇళ్లు..
జిల్లావ్యాప్తంగా 80 శాతం మేర నిర్మాణం పూర్తయి పంపిణీకి చేరువలో ఉన్న ఇళ్లు 1,227 వరకు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని చింతకుంట, పద్మానగర్ ఏరియాలోనే 660 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని ఏడు బ్లాకుల్లో ఆరు అంతస్తుల్లో నిర్మించారు. కరీంనగర్–వేములవాడ ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో నిర్మించిన ఈ ఫ్లాట్లపై స్థానిక పేదలు ఆశలు పెట్టుకున్నారు. మూడేళ్లలో రెండు సార్లు పదుల సంఖ్యలో మహిళలు ఆక్రమించుకునేందుకు కూడా ప్రయత్నించగా పోలీసులు వారిని వెళ్లగొట్టారు.
తరుచూ వస్తుండడంతో ‘ఫ్లాట్ల వద్దకు రావొద్దు’ అని పోలీసులు ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఈ అపార్ట్ మెంట్లలోని చాలా ఫ్లాట్లలో తలుపులు, కిటికీలు, ట్యాప్ లు, కరెంట్ బిగింపు వంటి పనులు మిగిలిపోయాయి. కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతోనే 20 శాతం మేర పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది.
జిల్లాలో పూర్తయిన డబుల్ ఇండ్లు ఇలా...
కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ఇండిపెండెంట్ హౌస్ పద్ధతిలో 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు. నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడంతో ఇళ్ల చుట్టూ పిచ్చి చెట్లు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ ఇళ్లను ఆక్రమించుకునేందుకు సమీప ప్రాంతాల్లోని మహిళలు గతంలో రెండు సార్లు ప్రయత్నించారు. పోలీసులు వచ్చి వెళ్లాగొట్టారే తప్ప ఆఫీసర్లు పంపిణీ చేయలేదు.
హుజూరాబాద్ లో సిర్సపల్లి పొలిమెరలో గణేశ్‌నగర్‌లో 527 డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లను అపార్ట్ మెంట్ పద్ధతిలో నిర్మించారు. ఐదేళ్లుగా ఈ ఫ్లాట్లను పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇందులోని ఫ్లాట్లు రాత్రిపూట మందుబాబుటలకు అడ్డాగా మారుతున్నాయి.