హుజూరాబాద్​లో ట్రయాంగిల్ ​ఫైట్.. గెలుపెవరిదో తేల్చడం కష్టమే...

హుజూరాబాద్​లో  ట్రయాంగిల్ ​ఫైట్..  గెలుపెవరిదో తేల్చడం కష్టమే...

కరీంనగర్, వెలుగు :  రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పేరున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు జరగనుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఈటల రాజేందర్ కు, అధికార పార్టీ అండ ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, తాత వారసత్వం ఉన్న ప్రణవ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఏడుసార్లు గెలిచి ఎనిమిదోసారి బరిలో నిలిచిన ఈటల.. ఈసారి గజ్వేల్ నియోజకవర్గంలోనూ సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎనిమిదోసారి ఎన్నికల బరిలో ఈటల 

బీఆర్ఎస్​పార్టీ తరపున 2004, 2008 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఈటల విజయం సాధించారు. తర్వాత 2009లో ఏర్పడిన హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అదే విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన జనరల్ ఎలక్షన్లు, బై ఎలక్షన్స్ కలిపి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2021లో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాక ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు ఈటల భార్య జమునారెడ్డిని హుజూరాబాద్​నుంచి పోటీలో నిలబెడతారనే ప్రచారం జరిగింది. కానీ, ఈటలే హుజూరాబాద్ తోపాటు గజ్వేల్ లో సీఎం కేసీఆర్​పై పోటీ చేస్తున్నారు. 2021 బై ఎలక్షన్స్ లో సింపతి బాగా వర్కవుట్​అయినప్పటికీ ఈ సారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.  బై ఎలక్షన్ లో గెలిచాక హుజురాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఆయనకు మైనస్​గా మారాయి.

వివాదాలకు కేరాఫ్ గా కౌశిక్ రెడ్డి.. 

బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి 2018లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో ఈటల టీఆర్ఎస్ ను వీడగానే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. తర్వాత ఆయనను ఎమ్మెల్సీ, విప్ పదవులు వరించాయి. గవర్నర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, ఉద్యోగులు, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చినా బీఆర్ఎస్ హైకమాండ్​ ఇవేమీ పట్టించుకోకుండా ఆయనకే టికెట్ కేటాయించి, బీఫాం ఇచ్చింది. ఈటలను గజ్వేల్ కు రాకుండా హుజూరాబాద్ కే పరిమితం చేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ హైకమాండ్​ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల10న మంత్రి హరీశ్​రావు జమ్మికుంటకు రాగా భారీగా జనసమీకరణ చేశారు. శుక్రవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దళితబంధు స్కీమ్ ద్వారా లబ్ధిపొందిన18 వేల కుటుంబాలు, ఇతర స్కీమ్ ల లబ్ధిదారులు, బై ఎలక్షన్ సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు, పార్టీ అండదండలే కౌశిక్ రెడ్డి బలం కాగా, నోటి దురుసుతనం, దూకుడు స్వభావం మైనస్ గా మారాయి.  

తాత వారసత్వం, క్లీన్ ఇమేజ్ తో ప్రణవ్.. 

మూడు తరాలుగా హుజూరాబాద్ నియోజకవర్గానికి సుపరిచితులైన వొడితెల కుటుంబం నుంచి ఈ సారి తమ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్​ ప్రణవ్ బాబును పోటీలో నిలిపింది. 2018లో హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో పని చేసిన అనుభవం ఉన్న ప్రణవ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రణవ్ చిన్నతాత కెప్టెన్ లక్ష్మీకాంతారావు బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కోసం పని చేస్తుండగా, ప్రణవ్ తండ్రి, కుటుంబసభ్యులు ఆయన కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రణవ్ పోటీ కారణంగా వొడితల ఫ్యామిలీ రాజకీయంగా రెండుగా చీలిపోయింది. హుజూరాబాద్ ప్రజలకు రాజ్యసభ మాజీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చిరపరిచితుడైన దివంగత సింగాపూర్ రాజేశ్వర్ రావు రాజకీయ వారసుడిగా ప్రణవ్ కు నియోజకవర్గంలో ఆదరణ లభిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చకపోవడం, క్లీన్ ఇమేజ్ ఉండడం ఆయనకు కలిసివచ్చే అవకాశముంది. 

ప్రభావితం చేసే అంశాలివే.. 

  • నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో మానేరు వాగు నుంచి రూలింగ్​పార్టీ లీడర్లు ఇసుక తరలించుకుపోతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, భవిష్యత్ లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని స్థానిక రైతులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్​కు మైనస్​గా మారొచ్చు.
  • హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను ప్రకటించాలని కొన్నాళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జిల్లా సాధన కోసం ఆందోళనలను మళ్లీ ప్రారంభించారు. జిల్లా ఏర్పాటు ప్రకటన అంశం ఎజెండాగా మారే అవకాశముంది. 
  • జమ్మికుంట పట్టణంలోని ఫ్లై ఓవర్ వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. ఫ్లై ఓవర్ తొలగింపు అనేది అన్ని పార్టీల అభ్యర్థుల హామీగా మారింది. 
  • దళితబంధు రెండో విడత డబ్బులు రాలేదు. నియోజకవర్గవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయలేదు. ఇది బీఆర్ఎస్​కు మైనస్​గా మారనుంది.
  • ఇల్లందకుంట మండల కేంద్రంలో గవర్నమెంట్ ఆఫీసులకు సొంత బిల్డింగుల నిర్మాణం చేపట్టలేదు.
  • వీణవంక మండలంలో కల్వల ప్రాజెక్టు పునర్నిర్మాణం పెండింగ్​లోనే ఉంది.