జీవో 64ను రద్దు చేయాలి..ఆశ్రమ స్కూళ్ల వర్కర్ల నిరసన

జీవో 64ను రద్దు చేయాలి..ఆశ్రమ స్కూళ్ల వర్కర్ల నిరసన

నస్పూర్/ ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. శుక్రవారానికి కలెక్టరేట్​ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆశ్రమ పాఠశాల హాస్టల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భి.మధు హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ స్కూళ్లలో పని చేస్తున్న అన్ని రకాల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. 

వారి జీతాలు తగ్గించేందుకు జీవో 64 తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది సరికాదన్నారు. సమ్మెలో భాగంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన ఆశ్రమ స్కూళ్ల వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేశారు. నాయకులు దుంపల రంజిత్ కుమార్, కొడుప మధునమ్మ, జేఏసీ నాయకులు, భీంరావు, లక్ష్మణ్, చందు, మొండన్న, లక్ష్మి, భాగ్య, సూరి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

 ఉట్నూర్​లో కార్మికుల భిక్షాటన

ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న కోరారు. ఆదిలాబాద్​జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని దుకాణాల్లో కార్మికులతో కలిసి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఆశన్న మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ స్కూళ్లలో ఔట్​సోర్సింగ్​లో పని
చేస్తున్న కార్మికులకు పెండింగ్​లో ఉన్న 6 నెలల వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. 

అరకొర జీతాలతో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ఆపడం సరకాదన్నారు. జీవో 64ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామ న్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న, గిరిజన శాఖ ఔట్​సోర్సింగ్ కార్మికుల నాయకులు, కైలాష్, కపిల్, బాధిరావు, విక్రమ్, మారుతి, కమలబాయి, తులసిబాయి తదితరులు పాల్గొన్నారు.