కాగజ్‌‌‌‌నగర్‌‌ ఆర్టీసీ బస్టాండు లో పాప మిస్సింగ్

 కాగజ్‌‌‌‌నగర్‌‌ ఆర్టీసీ బస్టాండు లో  పాప మిస్సింగ్

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్‌‌‌‌నగర్‌‌ ఆర్టీసీ బస్టాండులో ఓ యాచకురాలి కూతురు మిస్సింగ్​కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే కాగజ్ నగర్ మండలం పర్దాన్ గూడకు చెందిన గిరిజన మహిళ తుమ్రం స్వరూప భర్త జైలులో ఉండడంతో ఆమె ముగ్గురు పిల్లల పోషణ కోసం బస్టాండ్, తదితర ప్రాంతాల్లో యాచిస్తోంది. 

గురువారం ఆమె కాగజ్ నగర్ బస్టాండ్​కు తన ఇద్దరు కూతుర్లతోపాటు ఓ చంటిబాబుతో వచ్చింది. మధ్యాహ్నం బస్సులో ఎక్కి యాచిస్తున్న సమయంలో పెద్ద కూతురు కృష్ణవేణి బస్సు వద్ద నిలబడి ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి పాపను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

స్వరూప బస్సు దిగి వచ్చి చూడగా పాప కనిపించలేదు. దీంతో బస్టాండ్ మొత్తం వెతికింది. ఆచూకీ దొరక్కపోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పింది. వెంటనే టౌన్ ఎస్సై సుధాకర్ సిబ్బందితో వచ్చి బస్టాండ్ ప్రాంతంలో గాలించారు. బస్టాండ్ ప్రాంతంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది.