రెండు ఊర్ల మధ్య పోడు లొల్లి

 రెండు ఊర్ల మధ్య పోడు లొల్లి
  • సీఐ సహా నలుగురు కానిస్టేబుల్స్​కు గాయాలు
  • పోలీసుల లాఠీచార్జి
  • గాయపడిన గిరిజన మహిళ
  • 19 మంది అరెస్ట్, రిమాండ్

సత్తుపల్లి, వెలుగు :  ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో పోడు భూముల విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవ జరగ్గా ఆపేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో 19 మందిని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొనడంతో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. మండల పరిధిలోని చంద్రాయపాలెం గ్రామానికి చెందిన గిరిజనులకు వైఎస్ ​రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్న హయాంలో గ్రామ శివారులోని 9 హెక్టార్ల భూమికి పట్టాలిచ్చారు. 

అయితే ఆ భూములకు జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తమకు రెవెన్యూ పట్టాలిచ్చారని బుగ్గుపాడుకు చెందిన మరో గిరిజన వర్గం కొన్నేండ్లుగా వాదిస్తోంది. ఈ విషయంలో రెండు గ్రామాల గిరిజనుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీఐ కిరణ్ సిబ్బందితో సహా ఘటనా స్థలానికి వెళ్లి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. 

అప్పటికే ఆగ్రహంతో ఉన్న బుగ్గపాడుకు చెందిన గిరిజనులు సీఐతో పాటు పోలీస్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ కిరణ్​తో పాటు మరో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దాడి తర్వాత పోలీసులపై దాడి చేసిన గిరిజనులు బుగ్గపాడులో సమావేశం కావడంతో అప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో సత్తుపల్లి, వైరా సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులతో కల్లూరు ఏసీపీ రఘు బుగ్గపాడుకు చేరుకొని దాడికి పాల్పడిన గిరిజనులపై లాఠీ చార్జి చేశారు.

 ఈ ఘటనలో నాగమణి అనే గిరిజన మహిళ గాయపడింది. పోలీసులపై దాడులకు పాల్పడిన పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలిస్తుండగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడికి పాల్పడిన మరికొందరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా ఘటనలో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న మద్దిశెట్టి సామేలును ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయకన్ గూడెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.