
- జాతి నిర్మాణంలోగిరిజనుల పాత్ర మరువలేనిది
- అల్లూరి సంకల్పాన్ని ప్రతి గ్రామానికి తీసుకుపోవాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు అడవులు నక్సల్స్‌కు అడ్డాలుగా మారాయని.. కానీ, ఇప్పుడు నక్సల్స్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. జాతి నిర్మాణంలో గిరిజనుల పాత్ర మరువలేనిదని, ఆదివాసీలను సాధారణ జనజీవనంలోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
50 వేలకు పైగా ఆదివాసీ గ్రూపులను ఏర్పాటు చేశామని, మొదటిసారి గిరిజన మహిళను రాష్ట్రపతి చేశామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు సంకల్పం ప్రతి గ్రామానికి, ఇంటికి తీసుకుని వెళ్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో క్షత్రియ సేవా సమితి, కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అల్లూరి సీతారామరాజు128వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖలోని అల్లూరి జన్మస్థలం పద్మనాభ మండలం పాండ్రంగిలో అల్లూరి జ్ఞానమందిరాన్ని వర్చువల్‌గా రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో అల్లూరి స్నానమాచరించిన మంపకొలనును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావంత్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు త్యాగాన్ని కొనియాడారు. గిరిజన ప్రాంతంలో ఆధునిక ఆయుధాలు లేకపోయినా గెరిల్లా యుద్ధం ద్వారా బ్రిటిష్ పాలకులతో అల్లూరి పోరాడారని ఆయన గుర్తుచేశారు. గతంలో కనీసం నెట్‌వర్క్, టీవీలు, ల్యాప్ టాప్‌లు, మొబైల్ టవర్లు లేని ఈ ప్రాంతాల్లో ఇప్పుడు 8 వేల టవర్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో ఐటీఐ, టెక్నికల్ కాలేజీలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాలు మిగతా ప్రాంతాల తరహాలో అభివృద్ధి జరగాలని అల్లూరి కోరుకునేవారని, ఆయన ఆశయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయని అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవించిన ప్రాంతాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. -మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని జరుపుకోవడం గొప్పవిషయమన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన ధైర్యవంతులైన యోధులందరినీ మనం గుర్తుంచుకోవాలన్నారు.
యోధులకు చరిత్ర పుటల్లోస్థానం లేకుండా పోయింది: కిషన్‌రెడ్డి
దేశ స్వాతంత్ర్యం కోసం గిరిజన ప్రాంతాల్లో పోరాడిన అనేకమంది సమరయోధులకు చరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వారి చరిత్రను సమాజానికి, యువతరానికి అందించాలన్నదే ప్రధాని మోదీ ఉద్దేశమని తెలిపారు. గతంలోనే అల్లూరి సీతారామరాజు పూర్తి వివరాలను సేకరించి, ప్రధానికి వివ రించినట్టు తెలిపారు.
భీమవరంలో నిర్వహించిన 125వ జయంతోత్సవాలకు మోదీ కూడా అటెండ్ అయ్యారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, మాజీ కేంద్రమంత్రి అశోక గజపతిరాజు, కర్నాటక మంత్రి సుభాష్ చంద్రబోస్ రాజు,క్షత్రియ సేవా సమితి నేతలు సత్యనారాయణ రాజు, రఘు రామరాజు తదితరులు పాల్గొన్నారు.