అమ్మకానికి షుగర్ ప్యాక్టరీ..రైతుల బకాయిల సంగతేంది.?

అమ్మకానికి షుగర్ ప్యాక్టరీ..రైతుల బకాయిల సంగతేంది.?

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కొత్తూరు (బి) వద్ద ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ అమ్మకానికి పెట్టారు.  తమిళనాడుకు చెందిన ఫ్యాక్టరీ ఓనర్ నుంచి మూడేళ్ల పాటు లీజుకు తీసుకొని నడిపించిన వాళ్లు లీజు టైం పూర్తవకముందే చేతులెత్తేశారు. 162 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.12 కోట్లు చెల్లించకముందే ఓనర్‌‌కు అప్పగించినట్లు సమాచారం.  దీంతో ఓనర్ ఫ్యాక్టరీని మళ్లీ అమ్మకానికి పెట్టారని, వారం రోజుల్లోనే అమ్మకం ప్రక్రియ పూర్తికానుందని కేన్ కమిషనరేట్అధికారులు, రైతు సంఘాల నేతల ద్వారా తెలిసింది. ఇదే జరిగితే రైతులకు రావాల్సిన బకాయిలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

ముగ్గురి చేతుల్లోకి...

1973లో అప్పటి ప్రభుత్వం హైదరాబాద్- బీదర్ రోడ్డు పక్కన కొత్తూరులో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరుతో 132 ఎకరాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది.  అందులో పనిచేసే అధికారులు, సిబ్బంది కోసం  మధునగర్ కాలనీ పేరుతో నివాసాలు కూడా ఏర్పాటు చేసింది. రోజుకు 2,500 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ చాలాకాలం పాటు బాగానే నడిచింది. దీని చుట్టూ దాదాపు 30 వేల ఎకరాల్లో 8 వేల నుంచి10 వేల మంది రైతులు చెరుకు పండిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం 2003లో ప్రైవేటు వారికి విక్రయించింది. ఆ యాజమాన్యం 2006–-07లో మరొకరికి అమ్మగా, 2016–17లో తమిళనాడుకు చెందిన వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ట్రైడెంట్ పేరుతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని ఓనర్‌‌ రెండేళ్ల కింద మరొకరికి మూడేళ్లపాటు లీజుకు ఇచ్చారు.  అయితే వాళ్లు లీజు గడువు ముగియకముందే  తిరిగి ఓనర్ కు అప్పగించినట్లు తెలిసింది.  

 మొదటి నుంచీ సమస్యే

ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 2019 నుంచి రైతులను ఇబ్బందులు పెడుతూనే ఉంది.  ప్రతి సీజన్‌లో క్రషింగ్ ఆలస్యంగా స్టార్ట్ చేయడం, కోట్లల్లో బిల్లుల చెల్లింపులు పెండింగ్ పెట్టడం చేస్తోంది.  2021 సీజన్ కు సంబంధించిన రూ.12.69 కోట్ల బకాయిలు ఉండగా.. రైతులు ఆందోళనలు చేశారు.  దీంతో ఫ్యాక్టరీ ఆస్తులను వేలం వేసి రైతులకు డబ్బులు చెల్లిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించగా.. యాజమాన్యం దిగొచ్చి చెల్లింపులు చేసింది.  ఇదే సీజన్‌లో ఆర్థిక లావాదేవీల కారణంగా యాజమాన్యం క్రషింగ్‌ ఆపేసి ఫ్యాక్టరీ మూసేసింది. ఆ తర్వాత లీజుపై ఒక సీజన్ కొనసాగింది. అయితే గత సీజన్‌కు సంబంధించి రూ. 12 కోట్లు పెండింగ్‌లో ఉండగానే లీజు క్యాన్సల్ చేసుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.  షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టొద్దని రైతులు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, కలెక్టర్ శరత్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. వాళ్లు యాజమాన్యంతో చర్చలు జరిపినా సఫలం కాలేదు.  

ALSO READ:గురునానక్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ

బాకీలు చెల్లించేలా చూస్తాం

ట్రైడెంట్ యాజమాన్యం ఫ్యాక్టరీని అమ్ముతున్నట్టు మా దృష్టికి వచ్చింది. గత సీజన్ కు సంబంధించిన రూ. 12 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించేలా చూస్తున్నం. ఈ విషయమై యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా చెల్లింపులు చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నాం. కచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాం.

–రాజశేఖర్, చక్కెర శాఖ అసిస్టెంట్ కమిషనర్