
పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్: ట్రినిటాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్ బిస్సేర్ బిహార్ ముద్దుబిడ్డ అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమని తెలిపారు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రినిడాడ్‌కు చేరుకున్నారు. ఆయనకు అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్- బిస్సేర్, 38 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఘన స్వాగతం పలికారు. భారత సంతతి కళాకారులు భోజ్‌పురి చౌతాల్ (ఫోక్‌సాంగ్), డోల్ బీట్స్‌తో మోదీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ట్రినిటాడ్ అండ్టొబాగో, భారత్ మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. ‘‘వారు గంగా, యమునను విడిచిపెట్టారు కానీ వారి హృదయాల్లో రామాయణాన్ని మోసుకెళ్లారు. తమ నేలను విడిచిపెట్టారు, కానీ ఆత్మను కాదు.. వారు వలసదారులు కాదు, వారు ఆధునిక నాగరికతకు దూతలు’’ అని అక్కడి భారత సంతతి ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, ట్రినిటాడ్ ప్రధానికి మహాకుంభ్ జలంతో పాటు రామ మందిర ప్రతిమను మోదీ బహూకరించారు.
కమ్లాకు బిహార్‌తో విడదీయలేని అనుబంధం
ట్రినిటాడ్ప్రధాని కమ్లాకు భారత్‌తో విడదీయలేని అనుబంధం ఉన్నదని, ఆమె పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారని ప్రధాని మోదీ తెలిపారు. భారత పర్యటనలో కమ్లా బిహార్‌ను సందర్శించారని చెప్పారు. అక్కడి ప్రజలు ఆమెను బిహార్ కుమార్తెగా భావిస్తారని తెలిపారు. ‘‘బిహార్ వారసత్వం ప్రపంచానికే గర్వకారణం.
శతాబ్దాలుగా ప్రజాస్వామ్యం, రాజకీయాలు, దౌత్యం లాంటి వివిధ రంగాల్లో రాష్ట్రం ప్రపంచానికి మార్గం చూపింది. 21వ శతాబ్దంలో బిహార్ నుంచి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి” అని మోదీ తెలిపారు. గిర్మితియా సమాజం సమగ్ర డేటాబేస్‌ను రూపొందించడంలో ఇండియా చురుగ్గా పనిచేస్తున్నదని తెలిపారు. ట్రినిటాడ్ అండ్ టొబాగోలోని ఇండియన్స్సహకారంతో దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.