
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన త్రిష, తెలుగులో సినిమా చేసి ఐదేళ్లు అవుతోంది. అయితే చిరంజీవి సినిమాతో తను గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన చిరంజీవి వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా మొదట శ్రుతీహాసన్ పేరు వినిపించింది. అయితే తాజాగా త్రిషను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే త్రిషను సంప్రదించగా ఆమె కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. పదహారేళ్ల క్రితం ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి జంటగా నటించిన త్రిష.. మళ్లీ ఇన్నేళ్లకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. నిజానికి వీరిద్దరూ కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో ఆ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఆమె ప్లేస్‌లో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు. మొత్తానికి అలా మిస్ అయిన ఈ కాంబినేషన్ మళ్లీ వెంకీ కుడుముల సినిమా ద్వారా త్వరలోనే కనిపించబోతోంది. మరోవైపు ‘బృంద’ పేరుతో రూపొందుతున్న ఓ తెలుగు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది త్రిష. దసరాకి ప్రారంభమైన ఈ సిరీస్ షూటింగ్ జెట్ స్పీడుతో జరుగుతోంది. ఇందులో త్రిష పోలీసాఫీసర్‌గా నటిస్తోంది.