
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన నటన, గ్లామర్ తో తన కంటూ ప్రత్యేకను చాటుకున్న నటి త్రిష. తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ ప్రస్థానాన్ని ఎలిజిబుల్ బ్యూటీగా కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ గా దుబాయ్‌లో జరిగిన 2025 సైమా అవార్డ్స్ వేడుకలో ఎమోషనల్ అయ్యారు. ఆమె ప్రయాణాన్ని వివరిస్తూ ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శించిన తర్వాత, త్రిష తన సహనటుల గురించి మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ వేడుకలో త్రిష చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ అభిమానులను ఉర్రూతలూగించాయి. స్టేజ్‌పై విజయ్ ఫొటో చూపించగానే త్రిష ముఖంలో సిగ్గు, ఆనందం కనిపించాయి. ఆమె "గుడ్ లక్ విజయ్.. నీ కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. నువ్వు కన్న కలలన్నీ నిజం కావాలి. ఎందుకంటే దానికి నువ్వు అర్హుడివి" అని హృదయపూర్వకంగా చెప్పారు. దీంతో విజయ్ అభిమానుల కేరింతలు, ఈలలతో వేదిక ప్రాంగణం అంతా మార్మోగిపోయింది. గతంలో వీరిద్దరూ కలసి 'గిల్లి', 'తిరుప్పాచ్చి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. సుమారు 15 ఏళ్ల తర్వాత 2023లో వచ్చిన 'లియో' చిత్రంలో మళ్లీ జంటగా నటించి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు.
విజయ్ మాత్రమే కాదు, అజిత్‌తో ఉన్న అనుబంధం గురించి కూడా త్రిష ప్రస్తావించారు. నేను అతనితో పని చేశాను. అతను ఎంత దయగలవాడో, ఎంత వినయపూర్వకంగా ఉంటారు. లైట్‌మెన్ల నుంచి టెక్నీషియన్ల వరకు, అందరినీ ఒకేలా గౌరవిస్తారు. మూడ్ స్వింగ్స్ అనేవి అతనిలో ఎప్పుడూ చూడలేదు. అతని మంచితనం అద్భుతం అని ప్రశంసించారు.
ఈ వ్యాఖ్యలతో త్రిష-విజయ్ రిలేషన్ షిప్ పుకార్లు మరోసారి ఊపందుకున్నాయి. ఈ పుకార్లు వారిద్దరి వెకేషన్లు, టూర్ల సమయంలో కూడా బయటికి వస్తూనే ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రిష సూర్యతో కలిసి ఓ చిత్రంలో నటిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. విజయ్ కూడా 2026లో తన రాజకీయ ప్రస్థానం 'జన నాయకన్' సినిమాతో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, త్రిష చేసిన కామెంట్స్, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి నిరూపించాయి.