వినపడకుంటేనేం... ఆస్కార్ గెలిచిండు

వినపడకుంటేనేం... ఆస్కార్ గెలిచిండు

ఆస్కార్​ అవార్డ్​కి నామినేట్ అవ్వడమే గొప్ప విషయం. అలాంటిది విజేతగా నిలిస్తే.. మాటల్లో చెప్పలేనంత సంతోషం వేస్తుంది ఎవరికైనా. అమెరికన్​ నటుడు ట్రోయ్​ కాట్సర్​ కూడా ఇప్పుడు అంతే హ్యాపీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆస్కార్​ అవార్డులు ఆయనకు  చాలా ప్రత్యేకం. ఎందుకంటే వినికిడి శక్తి లేని మగ నటుడు ఆస్కార్​ గెలవడం ఇదే మొదటిసారి. ‘కొడా’ సినిమాలో సపోర్టింగ్ రోల్​ చేసినందుకు కాట్సర్ ఆస్కార్​ అందుకున్నాడు. 

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలో విజేతగా కాట్సర్​ పేరు అనౌన్స్ చేయగానే అక్కడివాళ్లంతా నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ క్షణం చాలా ఎమోషనల్​ అయ్యాడు కాట్సర్. ఆయనకి ఆస్కార్​ ఇచ్చిన తర్వాత సైన్​ లాంగ్వేజ్ ట్రాన్స్​లేటర్​ని పిలిచారు.‘‘ఇక్కడ మీ అందరి ముందు నిల్చోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. నాలోని నటుడిని గుర్తించినందుకు అకాడమీ మెంబర్స్​కి ధన్యవాదాలు.  మా నాన్న బెస్ట్  సైనర్. ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను. ఆయనే నా హీరో. నా ఫ్యాన్స్, నా భార్య, నా కూతురు కైరా, నా మేనేజర్... వీళ్లందరికీ థ్యాంక్స్.

నేను ఆర్టిస్ట్​గా ఎదిగేందుకు సాయం చేసిన డ్రామా కంపెనీలకు థ్యాంక్స్​​” అని సైగలతో ఎమోషనల్​ అవుతూ చెప్పాడు కాట్సర్​. తనకు వచ్చిన ఆస్కార్​ను ‘కొడా’ టీంకు, ప్రపంచంలోని వినికిడి శక్తిలేని వాళ్లకు, దివ్యాంగులకు అంకితం చేస్తున్నాడు అన్నాడు.  ‘కోడ’  డైరెక్టర్ సియన్​ హెడెర్​ని ‘అత్యుత్తమ కమ్యూనికేటర్’ అని, అద్భుతమైన సినిమా తీసిందని  పొగిడాడు కాట్సర్​. 
‘కొడా’ సినిమాకు ‘చైల్డ్ ఆఫ్​ డెఫ్​ అడల్ట్స్​’ అని అర్థం. వినికిడి శక్తి లేని తల్లిదండ్రులకు పుట్టిన 17 ఏండ్ల అమ్మాయి కథే ఈ సినిమా. ఇందులో ఆమెకు తండ్రిగా కాట్సర్​​, తల్లిగా మర్లీ మట్లీన్ నటించారు. ఈ సినిమాలో కాట్సర్​ నటనని చాలామంది మెచ్చుకున్నారు. ‘కొడా’కు ఈ ఏడాది మూడు ఆస్కార్​లు వచ్చాయి.
కాట్సర్​​కి తొమ్మిదేండ్ల వయసులో వినికిడి శక్తి లేదని తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో, కొడుకుతో మాట్లాడడం  కోసం వాళ్లు అమెరికన్ సైన్ లాంగ్వేజ్​ నేర్చుకున్నారు. 
స్కూల్​ డేస్ నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు కాట్సర్​​. ‘నేషనల్​ థియేటర్ ఆఫ్ డెఫ్​’లో యాక్టింగ్ జాబ్​ రావడంతో చెవిటి నటుడిగా ఆయన కెరీర్​ మొదలైంది. 30 ఏండ్లుగా సినిమాల్లో నటిస్తున్న కాట్సర్​​  ఫిల్మ్​మేకర్ కూడా.