మంత్రిని బద్నాం చేసేందుకు కుట్ర

మంత్రిని బద్నాం చేసేందుకు కుట్ర

టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోన్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ కోరుతూ పలువురు టీఆర్ఎస్  కార్పొరేటర్లు మంత్రి గంగులకు లేఖ రాశారు. రవీందర్ సింగ్ బంధువైన 49వ డివిజన్ కార్పొరేటర్ భర్త సోహెల్ సింగ్ ఆడియోపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. పదవుల కోసం అత్యాశతో వ్యవహరిస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్, అతని కుటుంబ సభ్యులైన సోహెల్ సింగ్ లను టీఆర్ఎస్ నుంచి తీసివేయాలని సీఎం కేసీఆర్ ను, మంత్రి గంగులను కోరారు. మంచిగా ఉన్న రోడ్డును తవ్వేసి.. మున్సిపాలిటీని, మంత్రిని బద్నాం చేసేందుకు కుట్ర చేసినట్లు ఆడియోలో స్పష్టంగా ఉందని కార్పొరేటర్లు ఈ లేఖలో పేర్కొన్నారు.

రవీందర్ సింగ్, సోహెల్ సింగ్ లు మంత్రి గంగులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే తమ మనుషులతో, జేసీబీలతో రోడ్లు, మురికి కాల్వలు, పైపు లైన్లు తవ్వి.. మేం చేసినట్లు చూపిస్తుండడం చూస్తుంటే వాళ్లు ఎలాంటి వాళ్లో గ్రహించాలని ప్రజలను కోరారు. ఇలా వారే సమస్యలు సృష్టిస్తూ, మంత్రిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని ఆరోపించారు.