ఉస్మానియాను కూల్చేందుకు స్కెచ్!

ఉస్మానియాను కూల్చేందుకు స్కెచ్!

ఐదేండ్ల నుంచి రిపేర్లు, మెయింటెనెన్స్ బంద్
ఇప్పుడు డ్రైనేజీ నీళ్లను సాకుగా చూపి కూల్చే ప్రయత్నం
కూల్చేస్తామని 2015లోనే సీఎం సంకేతాలు
హెరిటేజ్ బిల్డింగ్ ను ఎట్లకూలుస్తరని యాక్టివిస్ట్ ల ఆందోళన
పునాదులు, గోడలు గట్టిగా ఉన్నాయంటున్న ఎక్స్పర్ట్స్
రిపేర్లు చేస్తే దశాబ్దాలపాటు వాడుకోవచ్చని రిపోర్టు
పక్కనే ఉన్న కొత్త బిల్డింగూ కురుస్తున్నది
పాత బిల్డింగే కురుస్తుందంటే మరి కొత్త దాని కథేంది?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, యాక్టివిస్టులు
పాతది కూల్చకుండా కొత్తది కట్టాలని డిమాండ్

హైదరాబాద్‌, వెలుగు: ‘‘ఒక పేషెంట్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వస్తే పరిస్థితిని బట్టి మందులు ఇస్తారు. అవసరమైతే సర్జరీ చేస్తారు. అంతేకానీ చచ్చిపో అంటూ గాలికి వదిలేయరు. కానీ, ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్‌ బిల్డింగ్ పరిస్థితి చూస్తే మాత్రం.. ట్రీట్‌మెంట్‌ ఇవ్వకుండా చచ్చిపో అని చెప్పినట్లు ఉంది’’ అని హెరిటేజ్‌ యాక్టివిస్ట్ ఒకరు అన్న మాటలు నిజమేనని అనిపిస్తోంది. వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ను నేలమట్టం చేయాలని ప్రభుత్వం ఐదేండ్ల నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిపేర్లు, మెయింటెనెన్స్ చేస్తే దశాబ్దాల పాటు ఉండే ఈ హెరిటేజ్ బిల్డింగ్ ను ఇప్పుడు డ్రైనేజీ నీళ్ల సాకుతో కూల్చివేసేందుకు రెడీ అవుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఐదేండ్ల నుంచి ప్రభుత్వం ఈ బిల్డింగ్ కు రిపేర్లు, మెయింటెనెన్స్ చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కూల్చివేత పై 2015లోనే సీఎం కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోర్టు కూడా తప్పుబట్టింది. నాటి నుంచి ప్రభుత్వం మెయింటెనెన్స్ ను పట్టించుకోవడం మానేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీ పొంగడంతో ఉస్మానియాలోకి నీళ్లువచ్చాయి. దీంతో బిల్డింగ్ కూలే దశకు చేరుకుందని చెప్పి ఆఫీసర్లు సీజ్ చేశారు. హెరిటేజ్ బిల్డింగ్ ను కూల్చేసేందుకే ప్రభుత్వం ఐదేండ్ల నుంచి పక్కాగా ప్లాన్ చేస్తోందని, అందులో భాగంగానే మెయింటెనెన్స్ ను గాలికి వదిలేసి ఇప్పుడు కూలే దశకు చేరిందని నమ్మించేందుకు ప్రయత్నిస్తోందని యాక్విటిస్టులు మండిపడుతున్నారు. కూల్చివేస్తే ఊరుకునేది లేదని, ఈ బిల్డింగ్ పక్కనే 20 ఏండ్ల కింద కట్టిన కుతుబ్ షాహీ బిల్డింగ్ కూడా ప్రస్తుతం కురుస్తున్నదని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటే పక్కనే చాలా స్థలం ఉందని, హెరిటేజ్ బిల్డింగ్ ను కూలిస్తే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఐదేండ్ల కిందే సంకేతాలు
అతిపెద్ద హాస్పిటల్ అయిన ఉస్మానియాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహరశ్ద పడుతుందనుకున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌‌ఎస్‌ ఉస్మానియా హాస్పిటల్‌‌కు పూర్వవైభవం తెస్తామని ప్రకటించింది. 2015 జులై 23న సీఎం కేసీఆర్‌‌ హాస్పిటల్‌‌ను సందర్శించారు. కొత్త బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పారు. పాత బిల్డింగ్ ను కూలుస్తామనే సంకేతాలు ఇచ్చారు. కూల్చడంపై ప్రతిపక్షాలు, యాక్టివిస్టుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. కోర్టులో కేసులు ఫైల్‌‌ అయ్యాయి. హెరిటేజ్ బిల్డింగ్ అయిన దీన్ని రక్షించాలని కొందరు.. కూల్చాలని ఇంకొందరు పిటిషన్లు వేశారు. కోర్టు కూడా చారిత్రక బిల్డింగ్ ను కూల్చవద్దని చెప్పింది. ఉస్మానియా హాస్పిటల్‌‌ హెరిటేజ్‌ ‌బిల్డింగ్‌‌ల జాబితాలో ఉంది. దాంతో ఆ బిల్డింగ్‌‌ను కూల్చాలంటే ఎన్నో రూల్స్ అడ్డం వస్తాయి. దీంతో తెలంగాణ సర్కార్‌‌ అప్పట్లో పాత బిల్డింగ్ గురించి ఏం మాట్లడకుండానే అదే ఆవరణలో ఎనిమిది అంతస్తుల రెండు టవర్‌‌లు నిర్మిస్తామని చెప్పింది. ఈ మాటలు చెప్పి ఐదేండ్లవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. పాత బిల్డింగ్ ను పట్టించుకోవడం మానేసింది. అప్పటి నుంచి బిల్డింగ్ కు రిపేర్లు లేవు. మెయింటెనెన్స్ లేదు.

రిపేర్లు అవసరమన్న జేఎన్‌‌టీయూ రిపోర్టు
వాస్తవానికి ఉస్మానియా హాస్పిటల్‌‌ను జేఎన్‌‌టీయూ ఇచ్చిన రిపోర్ట్‌‌ ఆధారంగానే కూలుస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. జేఎన్‌‌టీయూ రిపోర్టులో ఏముందో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. హెరిటేజ్‌‌పై పోరాటం చేస్తున్న సంస్థలు ఆర్డీఐ ద్వారా ఆ వివరాలను సంపాదించాయి. అయితే రిపోర్టులో ఎక్కడ కూడా భవనాన్నికూల్చాలని రికమండ్‌‌ చేయలేదు. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో పెచ్చులూడాయని, దాని స్ట్రక్చరల్‌ ‌స్టెబిలిటీపై రిపోర్ట్‌‌ ఇవ్వాలని జేఎన్‌‌టీయూను టీఎస్ఎంఐడీసీ (తెలంగాణ స్టేట్‌‌ మెడికల్‌‌ సర్వీసెస్‌ అండ్‌ ‌ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్మెంట్‌‌ కార్పొరేషన్‌‌) 2015 మార్చిలో కోరింది. ఈ మేరకు ఒక టీం భవనాన్ని స్టడీ చేసి రిపోర్ట్‌‌ ఇచ్చింది. అందులో భవన సామర్థ్యం గురించి ఎక్కడా లేదు. పెచ్చులూడుతున్న పరిస్థితులు, గోడల్లోకి నీళ్లు ఇంకుతున్న విధానం, అక్కడక్కడా తుప్పు పట్టిన స్థంభాలు, గోడలపై మొక్కలు మొలుస్తున్నాయని రిపోర్ట్ లో పేర్కొంది. వీటికి రిపేర్లు అవసరమని, అది ఎలా చేయాలో కూడా టీం సూచించింది. అయితే రిపేర్లు చేసినా భవనం ఐదేండ్లకు మించి ఉండదని చివరలో ఒక మాట అన్నది.

మెయింటెనెన్స్‌‌ లేకనే: ఇంటాక్‌ స్టడీ
జేఎన్‌‌టీయూ రిపోర్ట్ తో‌ ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ను సర్కారు కూల్చేయాలని నిర్ణయానికి రావడంతో ఇంటాక్‌ (ఇండియన్‌‌నేషనల్‌‌ట్రస్ట్‌‌ ఫర్‌‌ ఆర్ట్‌ ‌అండ్‌ ‌కల్చరల్‌‌ హెరిటేజ్‌‌) సంస్థ రంగంలోకి దిగింది. హెరిటేజ్‌‌ బిల్డింగ్స్ పరిరక్షణ కోసం పనిచేసే ఈ సంస్థ తరఫున ఎక్స్పర్స్ ట్టీం ఒకటి 2015 ఆగస్టు2, 3 తేదీల్లో ఉస్మానియాకు వెళ్లి స్టడీ చేసింది. దానిపై రిపోర్ట్‌ ‌రిలీజ్‌ ‌చేసింది. హెరిటేజ్‌ ‌భవనమైన ఉస్మానియా పునాది గట్టిగా ఉందని, గోడలు కూడా పటిష్టంగా ఉన్నాయని చెప్పింది. కేవలం పెచ్చులే ఊడుతున్నాయని తేల్చింది. బిల్డింగ్ పైనుంచి వచ్చే వాన నీరు వెళ్లేందుకు వేసిన పైప్‌ లైన్లు పగిలిపోయి నీరు గోడల్లోకి ఇంకుతోందని చెప్పింది. దాంతో కింద వార్డుల్ లో కురవడమే కాకుండా గోడలపై మొక్కలు మొలుస్తున్నాయని అన్నది. సరైన మెయింటెనెన్స్‌‌ లేకనే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. జేఎన్‌‌టీయూ చెప్పిన ప్రకారం ఎక్కడ ఇనుప స్థంభాలు పాడై లేవని, కర్ర పని కూడా తలుపులు, డెకరేషన్‌‌కు మాత్రమే వాడారని చెప్పింది. బిల్డింగ్‌‌ను పరిరక్షించడం చాలా సులువని, తగిన రిపేర్లు చేసి, రెగ్యులర్‌‌గా మెయింటెన్‌‌చేస్తే దశాబ్దాలుగా నిలుస్తుందని తేల్చింది. ఐదేండ్లలో కూలుతుందనే జేఎన్‌‌టీయూ మాటను కొట్టి పారేసింది. తాజాగా కూడా ఈ రిపోర్ట్ పై స్పందించిన ఇంటాక్‌ హైదరాబాద్‌ చాప్టర్‌‌ కన్వీనర్‌ ‌అనురాధారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ ఐదేండ్లలో ఎలాంటి మెయింటెనెన్స్‌‌ లేకున్నా బిల్డింగ్‌ ‌ఎందుకు గట్టిగా ఉంది? ఎందుకు కూలలేదు? పెచ్చులు కూడా ఊడలేదు. ఎక్స్‌‌పర్ట్‌ ‌కమిటీని కూర్చోబెట్టి తగిన రీతిలో బిల్డింగ్‌‌కు రిపేర్లు చేయిస్తే అది నిలుస్తుంది’’ అని అన్నారు. మొత్తం మీద జేఎన్‌‌టీయూ, ఇంటాక్‌ రెండు సంస్థలు ఇచ్చిన రిపోర్టులు ఉస్మానియా హాస్పిటల్‌‌లోని హెరిటేజ్‌‌ భవనం సరైన మెయింటెనెన్స్‌‌ లేకనే పెచ్చులూడుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

కావాలనే రిపేర్లు బంద్!
ఉస్మానియా హాస్పిటల్‌‌ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కొంత నిరక్ష్ల్యం చేసినా.. ప్రతిపక్షాలు, యాక్విటిస్టులు ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రతిసారి ఎంతో కొంత రిపేర్లు చేస్తూ వచ్చారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నటైంలో ఈ హాస్పిటల్‌‌ కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశారు. పాత బిల్డింగ్ను రిపేర్ చేయడంతోపాటు కొత్త బిల్డింగ్ నిర్మాణానికీ కేటాయింపులు చేశారు. తర్వా త కొద్ది కాలానికే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్‌‌ తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత హాస్పిటల్‌‌ను సందర్శించిన నాటి నుంచి నేటి వరకు దాని బాగోగులు పూర్తిగా మూలకు పడ్డాయి. ఉస్మానియా హాస్పిటల్‌ ‌చారిత్రక భవనం కోసం ఎంత ఖర్చు పెట్టారని నిన్న, మొన్నటి ఆర్గ్యుమెంట్లలో కోర్టు ప్రభుత్వ తరఫు
లాయర్‌‌ను ప్రశ్నించింది. ఆ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దాంతో లాయర్‌‌ రూ. 6 కోట్లు ఖర్చు చేశామని చెప్పి వివరాలు సమర్పిస్తానని సమాధానం ఇచ్చారు. కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చాక సెక్రటేరియట్‌‌, అసెంబ్లీకి కొత్త భవనాలు నిర్మిస్తానని చెప్పారు. ఎర్రగడ్డలోని చెస్ట్‌‌ ఆసుపత్రిని కూడా అక్కడి నుంచి తరలిస్తామన్నారు. ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ను కూల్చేస్తామని, అక్కడ అసెంబ్లీ కడతామని శంకుస్థాపన కూడా చేశారు. సెక్రటేరియట్‌ ‌విషయంలో కూల్చివేతలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుత సెక్రటేరియట్ ఆవరణలోని చారిత్రక బిల్డింగ్(జీ బ్లాక్‌)తో పాటు కొంత కాలంకింద నిర్మించిన భవనాలను కూడా కూలుస్తున్నారు. ఇదే క్రమంలో ఉస్మానియా బిల్డింగ్ను కూల్చేందుకే ప్రభుత్వం కంకణం కట్టు కున్నట్లుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ మంకు పట్టుతోనే ఉస్మానియా హెరిటేజ్‌‌ బిల్డింగ్‌‌కు రిపేర్లకోసం డబ్బు కేటాయించకుండా అది మరింత క్షీణించేలా సర్కారు వ్యవహరించిందని హెరిటేజ్‌‌ యాక్విటిస్టులు మండిపడుతున్నారు.

పాతది కూల్చకుండా కొత్తది కట్టాలె
కార్పొరేట్‌‌కు తలదన్నే రీతిలో ఉస్మానియా హాస్పిటల్‌‌ కడతానని కేసీఆర్‌‌ అన్నడు. పాతబిల్డింగ్‌‌ కూల్చకుండా కొత్తది కట్టు. పాతది కూలిస్తే ఒప్పుకోం. నేను అందులో చదివినా. మాలాంటోల్లందరినీ బాధ పెట్టొద్దు. 26 ఎకరాల విశాల స్థలంలో ఉస్మానియా హాస్పిటల్‌‌ ఉంది. కొత్త బిల్డింగ్ లు కట్టుకునేంతందుకు మస్తు జాగా ఉంది. కొత్తది కట్టొద్దని మేం అంటలేం. పాతది కూల్చొద్దని చెబుతున్నం. అది హెరిటేజ్‌ బిల్డింగ్‌‌.
– నాగం జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్‌నేత

ఎందుకు రిపేర్ చేయలే?
సెక్రటేరియట్‌‌ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నది ఈ సర్కార్‌‌. ఉస్మానియా హాస్పిటల్‌‌ హెరిటేజ్‌ బిల్డింగ్‌‌ను రిపేర్‌‌ చేసేందుకు కొన్ని కోట్ల రూపాయలు ఇయ్యలేదా? బిల్డింగ్‌‌లోకి నీళ్లొచ్చింది సీవరేజ్‌ సిస్టమ్‌ ఫెయిల్‌‌ అయినందునే. దానికి ఇంజనీర్లను తప్పుబట్టాలె. జీహెచ్‌ఎంసీని తప్పుబట్టాలె. కానీ బిల్డింగ్‌‌ కూలుస్తా అంటే ఎట్లా? మెయింటెనెన్స్‌‌ చెయ్యక ఇట్లాంటి పనులకు పూనుకుంటే ఒప్పుకోం. హెల్త్‌‌ సెక్టార్‌‌ను సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదనడానికి ఇదే ఉదాహరణ.
– రాంచందర్‌‌రావు, ఎమ్మెల్సీ,బీజేపీ

కేసీఆర్ ది ఘోరమైన తప్పు
హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌ను కూల్చడం అంత ఈజీ కాదు. అదో పిచ్చితనం. హాస్పిటళ్లలో హెచ్‌బీబీ(హాస్పిటల్‌‌ బార్న్‌‌ బ్యాక్టీరియా) అనే సూక్ష్మ క్రీములు ఉంటాయి.ఉన్న ఫళంగా కూలిస్తే ఈ బ్యాక్టీరియాతో చాలా డేంజర్‌‌. హెరిటేజ్‌ బిల్డింగ్ కూల్చాలంటే చాలా ప్రాసెస్‌ ఉంటది. కమిటీలు వేయాలి. అవి కూర్చొని తేల్చాలి. వట్టిగనే కూల్చేస్తామని భయపెట్టడం కరెక్ట్‌‌ కాదు. కేసీఆర్‌‌ ఘోరమైన తప్పు చేస్తున్నడు.
-పాశం యాదగిరి, హమారా హైదరాబాద్‌‌ యాక్టివిస్ట్‌‌, సీనియర్‌‌ జర్నలిస్ట్

బిల్డింగ్ గట్టిగుంది.. మెయింటెనెన్స్ లేకపోవడమే సమస్య?
1908లో హైదరాబాద్‌కు ఫ్లడ్స్‌ వచ్చినప్పుడు నీళ్లు వస్తే.. మళ్లీ ఇప్పుడు వచ్చినయ్‌. దీనికి కారణం ఉస్మానియా వెనుక ఉన్న కట్టడాలు.. వాటికి తోడు డ్రైనేజీ, రోడ్ల కోసం చేసిన పనులు. వాటితోటి డ్రైనేజీ జామ్‌ అయి నీళ్లు హాస్పిటల్‌కు వచ్చినయ్‌. ఉస్మానియా ఓల్డ్‌ బిల్డింగ్‌ కూల్చాల్సిన పని లేదు. కొత్త బిల్డింగ్‌లు కట్టు కోవడానికి మస్తు జాగా ఉంది. పాతది ప్రొటెక్ట్‌ చేయాలి. కావాలంటే మేమంతా హెల్ప్‌ చేస్తం. పేషెంట్లను పెట్టేందుకు భయమైతే మ్యూజియం చేయవచ్చు. అడ్మినిస్ట్రేషన్‌కు వాడుకోవచ్చు. మా స్టడీలో బిల్డింగ్‌ గట్టిగా ఉందని తేలింది. మెయింటెనెన్స్‌లేకనే దానికి రిపేర్లొచ్చినయ్‌. ఐదేండ్ల నుంచి ఒక్క రిపేర్‌ చేస్తలేరు. 20 ఏండ్ల కింద కట్టిన కుతుబ్‌షాహీ బిల్డింగ్‌లోకి నీళ్లెట్లొచ్చినయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– అనురాధారెడ్డి, ఇంటాక్‌, హైదరాబాద్‌ చాప్టర్

వరదకు బిల్డింగ్ కారణం కాదు
తాజాగా ఉస్మానియా పాత బిల్డింగ్ లోకి నీరు వచ్చిందనే సాకుతో ప్రభుత్వం దాన్ని ఖాళీ చేసే పనిలో పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి డ్రైనేజీ నీరు వచ్చి చేరింది. దీనికి ఉస్మానియా మీదుగా వెళ్తున్న డ్రైనేజీ లైన్‌ కారణం. అది హాస్పిటల్‌ ఎగువ ప్రాంతం నుంచి వస్తోంది. పైభాగంలో రోడ్ల రిపేర్లు చేస్తున్నప్పుడు డ్రైనేజీ లైన్లు డిస్ట్రర్బ్‌ అయి, పూడిక పేరుకుపోయి సమస్య తలెత్తిందని ఆఫీసర్లు గుర్తించారు. ఉస్మానియా చరిత్రలో ఇంత వరద రావడం ఇదే మొదటిసారి. ఈ పరిస్థితికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అక్కడి డాక్టర్లు అంటున్నారు. ఉస్మానియా మీదుగా వెళ్లే డ్రైనేజీ వ్యవస్థ గురించి ఇంజనీరింగ్‌, జీహెచ్‌ఎంసీ ఆఫీసర్లు దృష్టి పెట్టలేదని వారు చెప్తున్నారు. కొత్త బిల్డింగ్ ఎట్ల కురువవట్లే? ఉస్మానియా పాత బిల్డింగ్కు పక్కనే 20 ఏండ్ల కింద నిర్మించిన కుతుబ్ షాహీ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్ లో గురువారం వార్డుల్లోకి కిటికీల గుండా వర్షపు నీరు వస్తే.. శుక్రవారం గోడల్లోంచి నీరు కారడం మొదలైంది. పాత బిల్డింగ్ కూలుతదని చెప్పి అక్కడి పేషెంట్లను ఈ బిల్డింగ్లోకి తరలించారు. 20 ఏండ్లకింద నిర్మించిన కుతుబ్ షాహీ బిల్డింగే కురుస్తున్నదంటే.. హాస్పిటల్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చని యాక్టివిస్టులు అంటున్నారు. ఐదేండ్ల కింద సీఎం పాత బిల్డింగ్ కూల్చివేతకు సంకేతాలు ఇచ్చారని, దాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతోనే మెయింటెనెన్స్ ను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు డ్రైనేజీ నీళ్లసాకుతో కూల్చాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.

For More News..

ఆర్టీఏలో..ఇంటి నుంచే మరో 5 సేవలు

పురిటి నొప్పులతో 15 గంటలు.. 180 కిలోమీటర్ల జర్నీ..