కేటీఆర్‍ మాటలతో.. సిట్టింగులకు నిద్రపట్టట్లే

కేటీఆర్‍ మాటలతో..  సిట్టింగులకు నిద్రపట్టట్లే

సిట్టింగులకు టిక్కెట్లిచ్చి నష్టపోయామన్న మంత్రి
ఓల్డ్ ​సెలక్షన్‍ ప్రాసెస్‍కు పుల్​స్టాప్ ​పెట్టే పనిలో టీఆర్ఎస్​
రాబోయే ఎన్నికలపై హైదరాబాద్‍ రిజల్ట్స్​ ఎఫెక్ట్​
వరంగల్‍, ఖమ్మం గులాబీ కార్పొరేటర్లలో టెన్షన్‍

జీఎచ్‍ఎంసీ ఎన్నికల్లో సిట్టింగ్‍ కార్పొరేటర్లు ఎక్కువ మందికి టిక్కెట్లు ఇవ్వడం పార్టీకి ఎంతో నష్టం చేసింది. ఇలాంటి పొరపాటే చేస్తే రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే రిపీట్‍ అయ్యే  డేంజర్​ ఉంది.  హైదరాబాద్‍లో ఆదివారం నిర్వహించిన జీహెచ్‍ఎంసీ ఎన్నికల పోస్ట్​మార్టంలో.. టీఆర్‍ఎస్‍ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍

వరంగల్‍ రూరల్‍, వెలుగు:టీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ మాటలు గ్రేటర్‍ వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్లలోని గులాబీ కార్పొరేటర్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. త్వరలో ఈ రెండు బల్దియాలకు ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో గ్రేటర్‍ హైదరాబాద్‍ తరహాలో టిక్కెట్లు మళ్లీ తమకే కన్‍ఫర్మ్​చేస్తారని నిన్న మొన్నటి వరకు సిట్టింగులు భావించారు. అయితే జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై పనిచేసిన కేటీఆర్‍ ఆదివారం హైదరాబాద్‍లో ప్రతికూల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు తెరతీయగా, సిట్టింగ్‍ కార్పొరేటర్లలో టెన్షన్‍ మొదలైంది.

నిన్నటి వరకు సిట్టింగులకే సీట్లు

ఉద్యమ పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పవర్​లోకి వచ్చిన టీఆర్‍ఎస్‍  కొంతకాలంగా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కువ సీట్లు సిట్టింగులకే ఇచ్చే సంప్రదాయం కొనసాగిస్తోంది.  పబ్లిక్‍, పార్టీ క్యాడర్, అక్కడి లీడర్ల ఒపీనియన్స్ తో సంబంధం లేకుండా హైకమాండ్​క్యాండిడేట్లను ఎంపిక చేస్తూ వచ్చింది. 2018 చివర్లో జరిగిన జనరల్​ఎలక్షన్స్​లో సొంత పార్టీలోనూ ఎవరూ ఊహించని విధంగా ఒకేసారి 100 మంది సిట్టింగులకు సీట్లు కన్‍ఫర్మ్​ చేసింది. సర్వేల్లో కొందరు అభ్యర్థులపై జనాల్లో వ్యతిరేకత ఉన్నా పట్టించుకోలేదు. టిక్కెట్‍ ఇచ్చేసి పార్టీ కేడర్‍ను వారి గెలుపు కోసం తిరగాలని ఆర్డర్‍ వేసింది. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్‍ ఎన్నికల్లో టీఆర్‍ఎస్‍ 16 మంది సిట్టింగుల్లో ఏడుగురికి చాన్స్​ఇచ్చింది. మరో ఐదుగురిని కొత్త పదవి ఇచ్చే ఉద్దేశంతో మార్చారు. అదే సెలక్షన్‍ ప్రాసెస్‍ను సెంటిమెంట్‍గా భావించిన టీఆర్ఎస్​ పెద్దలు జీహెచ్‍ఎంసీ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సిట్టింగులకే కట్టబెట్టారు.

సీన్ మారుతుందా?

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్​లో దెబ్బతిన్న తర్వాత పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ ఎలక్షన్స్​ రిజల్ట్స్​పై పోస్టుమార్టం నిర్వహించి.. అనుకున్నట్లుగా ఫలితాలు రాకపోవడానికి సిట్టింగులే కారణమన్నట్లుగా మాట్లాడారు. అది వరంగల్‍, ఖమ్మం కార్పొరేషన్‍ సిట్టింగులను కలవరపెడుతోంది. ఇప్పుడున్న అధికార కార్పొరేటర్లలో చాలామందికి ఆయా డివిజన్లలో వ్యతిరేకత ఉంది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. అవినీతి అక్రమాల్లో ఇన్వాల్​అయ్యారనే అపవాదు ఉంది. గ్రేటర్‍ వరంగల్​లో అయితే.. దాదాపు హైదరాబాద్‍ పరిస్థితులే నెలకొన్నాయి. చాలా డివిజన్లలో డెవలప్‍మెంట్‍ పేపర్ల మీద తప్పితే.. ఫీల్డ్​లో కనిపించట్లేదు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు కార్పొరేటర్లపై కూడా జనాల్లో  కోపం ఉంది. కొందరు సీనియర్‍ కార్పొరేటర్ల పేర్లు భూకబ్జాలు, అవినీతి ఆరోపణల లిస్టులో  వినపడుతున్నాయి.

సిటీలో మూడుసార్లు వరదలొచ్చి కాలనీలు అల్లాడుతుంటే ఆదుకోనివారిపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. టీఆర్‍ఎస్‍పై వ్యతిరేకతతో ఇతర పార్టీ, ఇండిపెండెంట్లను గెలిపిస్తే.. గులాబీ గూటికి జంప్‍ అయిన వారిపైనా ఓటర్లలో ఆగ్రహం ఉంది.  ఆదివారం రివ్యూలో కేటీఆర్‍ మాటలు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు గుడ్డిగా సీట్లిచ్చే విధానానికి రాంరాం చెప్పేలా కనపడుతోంది. అదే ఇప్పుడు అధికార పార్టీ కార్పొరేటర్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలనే దానిపై కొందరు ముందస్తు స్కెచ్‍ వేస్తున్నట్లు తెలుస్తోంది.

షాకిచ్చిన హైదరాబాద్​ ఓటర్లు

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ సొంతంగా 99 సీట్లు గెలుపొందింది. కానీ ఐదేండ్లు తిరిగేసరికి చాలామంది సిట్టింగుల పనితీరుపై గ్రేటర్​జనాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. చాలామంది కార్పొరేటర్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొనగా, కొందరు భూకబ్జాలు, సెటిల్‍మెంట్లలో ఆరితేరారు. అకాల వానలు, వరదల నేపథ్యంలో పబ్లిక్‍కు హెల్ప్​చేయడంలో విఫలం అయ్యారు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేసే క్రమంలో జనాల వద్ద కమీషన్లు వసూలు చేస్తున్నారని పలుచోట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,  గ్రేటర్‍ ఎలక్షన్ల సందర్భంగా సిట్టింగ్​కార్పొరేటర్లపై ఓటర్లలో కోపం ఉందనే విషయాన్ని పలు సర్వేలు తెలిపాయి. అయినా.. టీఆర్‍ఎస్‍ పెద్దలు అవేమీ పట్టించుకోకుండా ఏకంగా 77మంది సిట్టింగులకు సీట్లు కేటాయించారు. సీన్‍ కట్‍ చేస్తే.. గత ఎన్నికల్లో గెలిచిన 99 స్థానాల్లో ఈసారి 44 మైనస్‍ అయ్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతో, సిట్టింగులపై వ్యతిరేకతతో జనాలు టీఆర్‍ఎస్‍ పార్టీకి షాకిచ్చారు.