153 ఎకరాల భూ కబ్జాపై టీఆర్ఎస్ లీడర్ ఫిర్యాదు

153 ఎకరాల భూ కబ్జాపై టీఆర్ఎస్ లీడర్ ఫిర్యాదు

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం నడిగడ్డ, కల్వకుర్తి మండలం రామగిరి గ్రామాల మధ్య ఉన్న 153 ఎకరాల ప్రభుత్వ భూమిని మట్టి మాఫియా కబ్జా చేసిందని జడ్పీ చైర్ పర్సన్​పద్మావతి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా గుట్టను కొల్లగొడుతున్నారని, ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారు. సోమవారం ఆమె ప్రజావాణికి హాజరై ఈ మేరకు కంప్లయింట్ ఇచ్చారు. స్వయంగా అధికార పార్టీ జడ్జీ చైర్ పర్సన్ ప్రజావాణికి రావడంతో ఆర్డీఓ నాగలక్ష్మి, డీఆర్​డీఓ నర్సింగ్​రావు ఆమెకు ఎదురెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు. గతంలో ఇసుక అక్రమ దందాపై కూడా పద్మావతి నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లతో కలెక్టర్ మీటింగ్ పెట్టారు. కానీ ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

లోకాయుక్తలో గ్రామస్తుల ఫిర్యాదు... 
గుట్ట ప్రాంతంలో 17 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు నడిగడ్డ రైతులకు పంపిణీ చేశారు. ఈ భూమికి పట్టాలు కూడా ఇచ్చారు. రైతులకు పట్టాలిచ్చిన భూమిని సాగుకు యోగ్యంగా మార్చే పేరిట మట్టి మాఫియా తవ్వకాలు మొదలు పెట్టింది. అయితే తమకు ఇచ్చిన భూమితో సంబంధం లేకుండా గుట్టను పూర్తిగా తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారుల అండతోనే మట్టి మాఫియా ఇదంతా చేస్తోందని చెప్తున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టను తవ్వి రోడ్డు వేసి మట్టిని తరలిస్తున్నారని, ఈ అక్రమాలను అడ్డుకోవాలని  దేవాదాయ, మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్​ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవట్లేదన్నారు. దీంతో ఇటీవల లోకాయుక్తలో ఫిర్యాదు చేశామన్నారు. రామగిరి దగ్గర దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, దీనిపైనా కంప్లయింట్ ఇచ్చామన్నారు.